10-10-2025 12:05:15 AM
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరఫున ప్రజల్లోకి కుమార్తెలు అక్షర, దిశర
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార హోరు తారస్థాయికి చేరుకుంటోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయమే లక్ష్యంగా ఆమె కుమార్తెలు మాగంటి అక్షర, మాగంటి దిశర స్వయంగా ప్రచార బరిలోకి దిగారు. తమ తల్లి గెలుపు కోసం వారు ఇంటింటా తిరుగుతూ, ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. గురువారం వెంగల్‌రావు నగర్ డివిజన్‌లోని జవహర్ నగర్ కాలనీలో అక్షర, దిశర విస్తృతంగా పర్యటించారు.
ప్రతి ఇంటి తలుపు తట్టి, స్థానికులను ఆత్మీయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు తమ దివంగత తండ్రి, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గానికి చేసిన సేవలను గుర్తుచేశారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకే మా అమ్మ మీ ముందుకు వచ్చిందిని, కారు గుర్తుకు ఓటు వేసి, మా అమ్మను భారీ మెజారిటీతో గెలిపించి, మీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
తల్లికి మద్దతుగా ప్రచారంలోకి దిగిన యువతులు అక్షర, దిశరలను చూసి స్థానికులు ఆత్మీయంగా పలకరించారు. దివంగత నేత గోపీనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, వారికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.