02-01-2026 12:56:02 AM
అలంపూర్, జనవరి 1: దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన అలంపూర్ క్షేత్రం గురువారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ చెన్నారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న చెన్నారెడ్డి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు.
తొలుత బాలబ్రహ్మేశ్వర స్వామి వారి సన్నిధిలో ఏక వార రుద్రాభిషేకాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని, సాయంత్రం వేళ నయనానందకరంగా సాగే ప్రదోషకాల దశవిధ హారతులను వారు వీక్షించారు.పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు చెన్నారెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనాలు పలికారు. స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేసి, శేష వస్త్రాలతో వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఉన్నారు.