calender_icon.png 23 August, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటక మాజీ సీఎం మృతి

11-12-2024 02:35:31 AM

అనారోగ్యంతో ఎస్‌ఎం కృష్ణ  కన్నుమూత

బెంగళూరు సిలికాన్ వ్యాలీ రూపకర్తగా పేరు

  1. కర్ణాటకలో మూడు రోజులు సంతాప దినాలు

  2. కృష్ణ ఓ అసాధారణ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ

బెంగళూరు, డిసెంబర్ 10: కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం, బెంగళూరు సిలికాన్ వ్యాలీ రూపకర్త ఎస్‌ఎం కృష్ణ(92) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున బెంగళూరులోని సదాశివనగర్‌లో కన్నుమూశారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హ యాంలో ఆయన కేంద్ర, రాష్ట్ర రాజకీయా ల్లో ప్రముఖ పాత్ర పోషించారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో కొనసాగారు. ఆయన పూర్తి పేరు సోమనహళ్లి మల్లయ్య కృష్ణ. ఆయన మృతికి కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఆయనకు భార్య ప్రేమ, ఇద్దరు కూతుర్లు శాంభవి, మాళవిక (కేఫ్ కాఫీ డే సీఈవో) ఉన్నారు. 

చిన్న వయసులోనే అసెంబ్లీకి..

1932 మే1న కర్ణాటకలోని మాండ్య జిల్లా సోమనహళ్లిలో కృష్ణ జన్మించారు. 1960లో 28 ఏండ్ల వయసులోనే ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 30 ఏండ్ల వయసులోనే తొలిసారి1962లో మద్దూరు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తరువాత కొంతకాలం పాటు ప్రజా సోషలిస్టు పార్టీలో చేరి 1968లో జరిగిన ఉప ఎన్నికలల్లో మాండ్య లోక్‌సభ నుంచి గెలుపొందారు.

అనంతరం కాంగ్రెస్‌లో చేరి పార్టీలో సీనియర్ నేతగా కొసాగుతూ కీలక పదవులు నిర్వర్తించారు.1971లో కాంగ్రెస్ నుంచి మరల మాండ్య లోక్‌సభ స్థానంలో గెలిచారు.1971 నుంచి2014 వరకు చాలాసార్లు లోక్‌సభ, రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1985లో రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణ అడుగుపెట్టారు.1989 నుంచి 1993 వరకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 1993 కర్ణాటక డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. అలాగే ఎమ్మెల్సీగాను పనిచేశారు.

1999 మధ్య కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేసి అభివృద్ధిలో తనదైన మార్కును వేశారు. ఆ తరువాత 2004 డిసెంబర్ నుంచి 2008 మార్చి వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. యూపీయే హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో 2009 నుంచి 2012 మధ్య విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 

బీజేపీలోకి..

దాదాపు 50 ఏళ్లపాటు కాంగ్రెస్‌లో ఉన్న కృష్ణ 2017లో బీజేపీలో చేరారు. రాజకీయా ల నుంచి వైదొలుగుతున్నట్లు 2023లో ఆ యన ప్రకటించారు. ఆయన సేవలను గు ర్తించిన కేంద్ర ప్రభుత్వం 2023లో ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో సత్క రించింది.  

కన్నడ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎస్‌ఎం కృష్ణ మృతిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రాష్ట్రం లో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కర్ణాటక సీఎం గా ఆయన సేవలు ఎనలేనివని, రాష్ట్రంలో ఐటీ,బీటీ రంగాల వృద్ధికి ఆయన చేసిన కృషికి కర్ణాటక ఎప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.  అజాతశత్రువు, తనకు మార్గ దర్శిగా నిలిచిన ఆయన మరణం తనకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. 

ప్రముఖుల సంతాపాలు..

కర్ణాటక మాజీ సీఎం కృష్ణ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు తన  ప్రగాఢ సానుభూతిని తెలి యజేశారు. కృష్ణ ఓ అసాధారణ నేత అని, జీవితాంతం ఇతరుల కోసం పాటుపడ్డారని గుర్తు చేసుకున్నారు. సీఎంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. ఆయనలో గొప్ప పాఠకుడు, ఆలోచనాపరుడు ఉన్నారని కొనియాడారు.

కర్ణాటలో మౌలిక సదుపాయాల కల్పనేపైనే ఆయన శ్రద్ధ పెట్టారని చెప్పారు. ఆయనతో తాను చాలాసార్లు భేటీ అయ్యాయని పేర్కొన్నారు. కృష్ణ మరణంపై మాజీ ప్రధాని దేవేగౌడ సంతాపం తెలిపారు. తన ఫ్రెండ్, సుధీర్గ సహచరుడు కృష్ణ మరణం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. కాగా కృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఐటీపై ముద్ర..

కర్ణాటక సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు. ఈ సమయం లోనే బెంగళూరులో ఐటీ రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చి ఐటీ అభివృద్ధికి బాటలు వేశారు. ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా బెంగళూరును మార్చారు. దేశంలోనే ఐటీలో టాప్ బెంగళూరు తీర్చిదిద్దారు.  

అమెరికాలో లా విద్య..

మైసూరులోని మహారాజా కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తి చేశా రు. అనంతరం బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా కోర్సు చేశారు. తరువాత అమెరికాలో టెక్సాస్‌లోని సదరన్ మెథ డిస్ట్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. 1960లో అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ లా స్కూల్‌లో ఆయన న్యాయవిద్యను అభ్యిసించి ప్రతిష్టాత్మకమైన ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌ను ఆయన అందుకున్నారు. 

కెనడీ తరఫున ప్రచారం..

అమెరికాలో లా చదువుతున్న సమయంలోనే జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో  డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జాన్ ఎఫ్ కెనడీ పోటీ చేశారు. ఈ క్రమంలో ఇండో  అధికంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ ప్రచా రం కోసం తాను కొన్ని వ్యూహాలు చెబుతానని కెనడీకి కృష్ణ లెటర్ రాశారు. దీనికి ఆయన  ఒప్పకోవడంతో  కెనడీ గెలుపు కోసం కృష్ణ ప్రచారం చేశారు. ఆ తరువాత అధ్యక్షుడిగా ఎన్నికైన కెనడీ.. ఎన్నికల్లో  కృష్ణ సహకారాన్ని అభినందిస్తూ తాను గెలవడానికి ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా కృషి చేశారని ఓ లెటర్ రాసి మెచ్చుకున్నారు. అనంతరం కృష్ణ భారత్‌కు తిరిగి వచ్చి రాజకీయాల్లోకి ప్రవేశించారు.