calender_icon.png 3 July, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిన్న సీఎం చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు

02-07-2025 01:14:47 PM

హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(State Irrigation Minister Uttam Kumar) సతీ సమేతంగా విజయవాడ వెళ్లారని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) బుధవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పోలవరం-బనకచర్లకు పచ్చజెండా ఊపారని హరీశ్ రావు ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజయవాడ వెళ్లి మాట్లాడారని చెప్పారు. ఇద్దరూ పచ్చజెండా ఊపాక కేంద్రప్రభుత్వానికి ఏపీ ఉత్తరం రాసిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్(Praja Bhavan) సాక్షిగా జూలై 6, 2024న రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య బనకచర్ల ప్రాజెక్టుకు చీకటి ఒప్పందం జరిగిందని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ వేదికగా రేవంత్ రెడ్డి, విజయవాడ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బజ్జీలు తిని బనకచర్లకు పచ్చజెండా ఊపారు. 

నిన్న ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి బనకచర్లపై ఇచ్చిన ప్రెజెంటేషన్.. తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా?, అమరావతి నుండి బాబు పంపిండా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్రానికి రాసిన లేఖలు గానీ మాట్లాడిన మాటలు గాని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi) కాంగ్రెస్ ను మొద్దు నిద్ర లేపిందని హరీశ్ రావు అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు బీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేసిందన్నారు. గోదావరిలో 1000 టిఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంత్ రెడ్డికి, మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసిందన్నారు. మల్లా అవే పాత అబద్దాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయవు?, చంద్రబాబు పట్ల నువ్వు చూపుతున్న గురు భక్తికి ఇది నిదర్శనం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం, సీడబ్ల్యూసీ(Central Water Commission) అనుమతి పొందకుండా ఈఏసీ అనుమతి ఇవ్వదని ఆయన వివరించారు. ఏపీ అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి వెళ్లే కంటే ముందే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లాలనే సోయి లేదని ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేని వ్యక్తులు నీటి పారుదల శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని ఆయన ఆరోపించారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రస్తావనే రాని బనకచర్ల ప్రాజెక్టు, ఇప్పుడు ఎవరి అండ చూసుకొని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మౌనంగా ఉంటూ అందిస్తున్న సహకారం వల్లనే కదా బనకచర్ల వ్యవహారం ఇక్కడి దాకా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం చేస్తూనే, లెక్కకు మించి అబద్దాలు ప్రచారం చేస్తూ.. బీఆర్ఎస్ పై చేస్తున్న నీ క్షుద్ర రాజకీయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని హరీశ్ రావు హెచ్చరించారు.