28-05-2025 12:49:07 AM
- గుండెపోటుకు గురై హైదరాబాద్‌లో కన్నుమూత
ఖమ్మం, మే 27 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి: ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ మంగళవారం మృతిచెందారు. గుండెపోటు కారణంగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం ఈర్లపూడి గ్రామానికి చెందిన మదన్‌లాల్ గతంలో ఈర్లపూడి సర్పంచ్‌గా పనిచేశారు. 2014లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరి, వైరా ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరి 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ప్రస్తుతం వైరా నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. మృదుస్వభావి, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొన్న మదన్‌లాల్ దివంగత మాజీ మంత్రి రామ్‌రెడ్డి వెంకట్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనకు కొడుకు మృగేందర్ లాల్ ఐఏఎస్ (తమిళనాడు క్యాడర్), కుమార్తె ఉన్నారు.
మదన్‌లాల్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం ఖమ్మం కవిరాజ్ నగర్ రోడ్డులోని మదన్‌లాల్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మదన్ లాల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
మదన్‌లాల్ మరణం పట్ల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మదన్‌లాల్ మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. మదన్ లాల్ మృతి బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. మదన్‌లాల్ కుటుంబ సభ్యలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.