calender_icon.png 13 May, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.2.47 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

13-05-2025 12:25:05 AM

అరుగుపై కూర్చొని.. అర్జీలు స్వీకరణ 

ఆదివాసీ జనంతో మమేకమైన ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి 

పూర్తిగా అటవీ ప్రాంతంలో కొనసాగిన పర్యటన

అశ్వారావుపేట, మే12 (విజయ క్రాంతి) : పూర్తిగా అటవీ ప్రాంతం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నుంచి 34 కి. మీ. దూరం,అంతా దట్టమైన ప్రాంతం గుండా,పెద్ద వాగు, అనంతారం, చిన్న వాగు, కట్లంవాగు,వాగులూ.. వంకలూ దాటుకొని  ఆదివాసీ గూడేల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రాఘురాం రెడ్డి సోమవారం విస్తృతంగా పర్యటించారు.

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మారుమూల ఆదివాసీ గ్రా మాల్లో చెన్నాపురంలో రూ. 1.07 కోట్లు, పే రాయి గూడెం లో రూ. 1.40 కోట్లు,మొత్తం రూ. 2.47 కోట్ల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరాయిగూడెం గ్రామ పంచాయతీ వద్ద అరుగుపై ఎంపీ రఘరాం రెడ్డి కూర్చొని గ్రామసభ నిర్వహించారు.

చెన్నాపురం గ్రామంలో గ్రామ సెంటర్ లో సీ సీ రోడ్లను ప్రారంభించి, అక్కడ నేలపై వేసిన పట్టాపై కింద కూర్చొని ఆదివాసీల యోగక్షేమాలు తెలుసుకున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వేలాది కోట్లను వెచ్చిస్తోందని చెప్పారు. వీటిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

మంచో పరసోదమ్..అంటూ కృతజ్ఞతలు తెలిపిన ఆదివాసీలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఏలూరు జిల్లా సరిహద్దులో గల తమ గ్రామాలకు వచ్చి, నిధులు కేటాయించి అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ రామ సహాయం రెడ్డికి ఆయా గ్రామాల ఆదివాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతవరకు ఏ ఎంపీ తమ వద్దకు రాలేదని తెలిపారు. మంచి పరసొదమ్.. సార్ అంటూ ( చాలా ధన్యవాదాలు).. అంటూ ఆదివాసి భాషలో కృతజ్ఞతలు తెలిపారు.