10-01-2026 09:20:11 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం 52వ డివిజన్ పరిధిలోని వాగ్దేవి కళాశాల వెనుక భాగంలో చేపట్టనున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. స్థానిక ప్రజల దీర్ఘకాలిక అవసరాల దృష్టిలో పెట్టుకొని ఈ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నామని, డ్రైనేజీ పూర్తి అయితే వర్షాకాలంలో నీటి నిలువలు, మురుగు సమస్యలు తగ్గి ప్రజలకు స్పష్టమైన ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
నయీమ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నాళాల వ్యవస్థ పటిష్టం చేస్తున్నామని, ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటిక నిధులు కేటాయించిందని, ఈ నెలలోనే పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు చరిత్రలో అభివృద్ధి పనులు ఉండేలా చేస్తామని తెలిపారు.
అనంతరం వాగ్దేవి కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగిమంటలను వెలిగించి ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. అభివృద్ధితో పాటు సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు.