23-08-2025 05:28:52 PM
సిద్దిపేట క్రైమ్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న యువకులను అరెస్టు చేసినట్టు త్రీటౌన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ విద్యాసాగర్(Inspector Vidyasagar) తెలిపారు. కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కామల్ల రాకేశ్, దుద్దెడ గ్రామానికి చెందిన ఎండీ అమీర్, కుసుంబ ఆకాష్, రొడ్డ నర్సింలు అనే యువకులు గంజాయికి అలవాటు పడ్డారు. సికింద్రాబాద్ అల్వాలకు చెందిన సతీష్ వద్ద నుంచి రాకేశ్, కరీంనగర్ పట్టణానికి చెందిన షాహాబాజ్ వద్ద నుంచి అమీర్ కొంతకాలంగా గంజాయి కొనుగోలు చేస్తూ, స్నేహితులతో సేవించడంతో పాటు అమ్ముతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 22న మధ్యాహ్నం దుద్దెడ గ్రామ శివారులో నలుగురు యువకులు గంజాయి సేవిస్తూ, సరఫరా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు త్రీటౌన్ ఎస్ఐ వి.వెంకటేశ్వర్లు సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. వారి నుంచి 255 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.