calender_icon.png 18 January, 2026 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలుగురు మావోయిస్టులు మృతి

18-01-2026 01:15:22 AM

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

పార్టీ అగ్రనేతలు పాపారావు, దిలీప్ మృతి

మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు కూడా..

వివరాలు వెల్లడించిన బీజాపూర్ ఎస్పీ జితేంద్ర

చర్ల/ రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు సహా నలుగురు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా కమిటీ కార్యదర్శి దిలీప్ వేద్జా, మావోయిస్టు అగ్రనేత పాపారావు అలియాస్ మంగు కూడా ఉన్నారు. వీరిలో పాపారావు తలపై రూ.కోటి రివార్డు ఉంది. 

బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పాపారావుతో పాటు పలువురు కీలక నేతల సంచారం ఉందని సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు ఆ ప్రాంతంలోకి భారీగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా బెటాలియన్ సభ్యులను మోహరింపజేశారు. ‘ఆపరేషన్ పాపారావు’ పేరుతో బల గాలు చేపట్టిన ఈ కూంబింగ్‌లో వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. 

మృతుల్లో పార్టీ అగ్రనేతలు దిలీప్ వేద్జా, పాపారావు ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే మిగిలిన ఇద్దరు మావోయిస్టులను గుర్తించే పనిలో వారు నిమగ్నమయ్యారు. అలాగే ఘటనా స్థలం నుంచి జవాన్లు రెండు ఏకే-47 రైఫిళ్లు, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పాపారావు సహచరి ఊర్మిళ గతే డాది దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది. అదే ఎన్‌కౌంటర్‌లో పాపారావు తప్పించుకుని పారపోగా, తాజా ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతిచెందాడని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి.