calender_icon.png 21 November, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో నలుగురి అరెస్ట్

21-11-2025 12:00:00 AM

-నిందితులంతా  వైద్యులే.. ఆరుకు చేరిన అరెస్ట్‌ల సంఖ్య

-2008లో అహ్మదాబాద్ పేలుళ్ల కేసు నిందితుడూ అల్ పూర్వ విద్యార్థే

-అప్పటి నుంచి పరారీలోనే ఉగ్రవాది షాబాద్ బేగ్

శ్రీనగర్, నవంబర్ 20: ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సం స్థ (ఎన్‌ఐఏ) గురువారం తెలిపింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. పాటియాలా హౌస్ కోర్టులోని జిల్లా సెషన్స్ జడ్జి ఆదేశాల మేరకు శ్రీనగర్‌లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ ప్రతినిధి తెలిపారు. నిందితులు పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై, అనంతనాగ్‌కు చెం దిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్, లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్, షోపియన్‌కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగేగా గుర్తించినట్లు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది.

నాటి ఉగ్రవాది అల్ విద్యార్థే..

2008లో అహ్మదాబాద్‌లో వరుస పేలు ళ్లు, 2007లో గోరఖ్‌పూర్ పేలుడు కేసుల్లో నిందితుడు షాబాద్ బేగ్ అల్ యూ నివర్సిటీ పూర్వ విద్యార్థి అని ఢిల్లీ పేలుళ్ల కేసు దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించారు. ఫరీదాబాద్‌లోని ఆ విద్యా సంస్థలో 2007లో షాబాద్ బేగ్ బీటెక్ పూర్తి చేశాడు. అతని విశ్వవిద్యాలయ గుర్తింపు కార్డును దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2008 ఢిల్లీ పేలుళ్ల తర్వాత, బేగ్ భారతదేశం నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఇంటర్పోల్ రెడ్ నోటీసుకు కూడా అతను గురయ్యాడు.

బేగ్ మొదట భారతదేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్‌కు పారిపోయాడు. తరువాత ఇస్లామిక్ స్టేట్లో చేరాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి, అతను భారతదేశం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. 2008 నుంచి పరారీలో ఉన్నాడు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల దర్యాప్తులో బేగ్‌కు అల్ సంబంధం ఉందని అధికారులు నిర్ధారించారు. తాజా విచారణలో భాగంగా మరోసారి షాబాద్ పేరు వెలుగులోకి వచ్చింది.    

మధ్యప్రదేశ్‌లో అల్ చైర్మన్ అక్రమ నిర్మాణాలు

ఢిల్లీ పేలుళ్ల కేసులో అల్ యునివర్సిటీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ వర్సిటీ చైర్మన్‌గా ఉన్న జావెద్ సిద్దిఖీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మధ్యప్రదేశ్‌లోని మోవ్ కంటోన్మెంట్ బోర్డులో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. మూడు రోజుల్లో ఆ నిర్మాణానికి కూల్చివేయాలని నోటీసులు జారీ చేశారు. కంటోన్మెంట్ ఇంజినీర్ హెఎస్ కలోయా మాట్లాడుతూ జావెద్ తండ్రికి సంబంధించిన ఇంటిలో అనధికారికంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా బేఖాతరు చేశారని.. ఇప్పుడు కూడా తమ ఆదేశాలను పట్టించుకోక పోతే కూల్చివేత పనులు తామె చేపడతామన్నారు. ఢిల్లీ పేలుళ్ల కేసులో ఇప్పటికే అల్ వర్సిటీ చైర్మన్ జావెద్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.