calender_icon.png 6 May, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం తూకాల్లో మోసం!

12-04-2025 12:00:00 AM

  1. రైస్ మిల్లులు వేబ్రిడ్జిలపై పర్యవేక్షణ లేమీ
  2. పలుచోట్ల మోసాలు జరుగుతున్నట్లు ఆరోపణలు 
  3. పట్టించుకోని తూనికలు, కొలతల శాఖ
  4. ఫిర్యాదులు వస్తే తూతూమంత్రంగా తనిఖీలు
  5. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు నిర్లక్ష్యం

నల్లగొండ /వేములపల్లి, ఏప్రిల్ 11 (విజయక్రాంతి):  జిల్లాలో పలుచోట్ల రైస్మిల్లర్ల దోపిడీ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం ట్రాక్టర్కు 30 కిలోలకుపైగా తరుగు, హమాలీ, ఇతరాత్ర ఖర్చుల పేరుతో దోచుకుంటున్నారు. కొన్ని మిల్లుల్లో వేబ్రిడ్జిలను ట్యాంపరింగ్ చేసి తూకాల్లోనూ మోసాలకు పాల్పడుతూ కర్షకులను ముంచిన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. 

సీజన్ ప్రారంభం నుంచి దోపిడీ..

యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి వేబ్రిడ్జిల్లో తూకాల మోసాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు మిల్లర్లు తూకాల్లో మోసం చేస్తూనే ఉన్నారు. ట్రాక్టర్లతో రైతులు నేరుగా మిల్లులకు ధాన్యాన్ని తీసుకెళ్లినప్పుడు వేబ్రిడ్జిలపై తూకం వేస్తారు. ఇవి ఎంత బరువు చూపిస్తే అంతే మొత్తానికి వ్యాపారులు బిల్లు చెల్లిస్తారు.

మిల్లులో ధర ఖరారు కాగానే ఆ మిల్లులోనే ధాన్యం కాంటా వేయాల్సి ఉంటుంది. రైతులు మరోచోటకు వెళ్లి తూకం వేసుకొని వచ్చేందుకు అవకాశం లేదు. దీంతో కొందరు మిల్లర్లు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులోని ఓ వేబ్రిడ్జిలో తూకంలో మోసాలను అధికారులు గుర్తించారు. 10 టన్నుల ధాన్యం తూకంలో 40 కేజీల తేడా చూపించింది.

ఈ విషయాన్ని స్వయంగా తూనికలు, కొలతల అధికారులు బహిర్గతం చేశారు. కానీ అప్పటికే చాలా మంది రైతులకు జరగాల్సిన నష్టం జరిగింది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన కొనుగోళ్లు ముగిసే సమయంలో తనిఖీలు చేయడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. ఈ వేబ్రిడ్జికి రెండు మిల్లులు అనుసంధానంగా ఉన్నాయి. నిత్యం దాదాపుగా 600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతుంది.

ఇక్కడ తూకాల్లో మోసాన్ని అధికారులు గుర్తించి మిల్ల్ప కేసు నమోదు చేసి రూ. 1.25 లక్షల జరిమానా విధించారు. కానీ మోసపోయిన రైతులకు  పరిహారం ఎవరు చెల్లి స్తారు? ఎంత చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.  కోట్లలో దోచుకొని నామమాత్రపు జరిమానా చెల్లిస్తే ఎవరికి ప్రయోజ నమని రైతులు మండిపడుతున్నారు.   

గతంలో ఓ రైస్మిల్లులో అక్రమాలు.. 

గత వానాకాలంలో వేములపల్లి మండలంలోని ఓ రైస్ మిల్లులు కాంటాల్లో మోసాన్ని రైతు పసిగట్టారు. ముందుగా ధాన్యాన్ని వేబ్రిడ్జిపై కాంటా వెయ్యగా 6,920 కిలోలు వచ్చింది. అనంతరం ఓ మిల్లులోకి తీసుకెళ్లి కాంటా వేయగా 6,870 కిలోలు వచ్చింది.

50 కిలోల తేడా రావడంతో మిల్లు యాజమాన్యంతో రైతు గొడవకు దిగాడు. విషయం బయటకు రాకుండా యాజమాన్యం కొందరికి అమ్యామ్యాలిచ్చి పరిస్థితి చక్కబెట్టింది. వేములపల్లి, మిర్యాలగూడ పరిసరాల్లోని కొన్ని రైస్మిల్లుల్లో ప్రస్తుతం ఇదే తరహాలో మోసాలు జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. 

తెరుచుకొని కొనుగోలు కేంద్రాలు..  

యాసంగి కోతలు దాదాపుగా దగ్గరపడ్డాయి. రైతులు వరికోసి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లు తూకాల్లో మోసంతోపాటు మద్దతు ధర సైతం చెల్లించకుండా కర్షకులను దగా చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణపై ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదన్న అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతున్నది. గతంలో పంటలు కోతకు వస్తున్న తరుణంలోనే యంత్రాంగం అప్రమత్తమయ్యేది.

రైస్మిల్లర్లు, ప్రైవేటు వర్తకులు, లారీల యజమానులు, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, రవాణా, తూనికలు, కొలతలు, పౌరసరఫరాలశాఖ, పౌరసరఫరాల సంస్థ ఇలా కొనుగోళ్లతో సంబంధం ఉన్న ప్రతిశాఖతో తరచూ సమీక్షలు నిర్వహించి కొనుగోళ్లను సమన్వయం చేసే వారు. కానీ ప్రస్తుతం జిల్లాలో చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభ దశలోనే ఉన్నాయి.

దీంతో గత్యంతర లేక రైతులు రైస్ మిల్లుల్లోనే ధాన్యం అమ్ముకొని నష్టపోవాల్సి వస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అటు మద్దతు ధర.. సన్నాలకు రూ. 500 బోనస్ నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తనిఖీలు ముమ్మరం చేయాలి..

తూనికలు, కొలతలశాఖ అధికారులు రైస్ మిల్లుల వేబ్రిడ్జిలపై మరింత దృష్టి పెట్టాలి. చాలాచోట్ల రైస్ మిల్లుల్లో మోసాలు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు ప్రారంభం నుంచే ప్రతి రైస్ మిల్లులోని వేబ్రిడ్జిని తనిఖీ చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారు. రైస్ మిల్లర్లు ధాన్యానికి మద్దతు ధర సైతం  చెల్లించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి.  

 మేరెడ్డి పృథ్వీకుమార్ రెడ్డి, రైతు, మొల్కపట్నం (వేములపల్లి మండలం)