14-07-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల:జూలై 13 (విజయక్రాంతి) జిల్లాలోని పేద విద్యార్థుల విద్యారవాణా సమస్యలను పరిష్కరించేందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుకగా ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జులై 15న మంగళవారం నుండి సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, శిశుమందిరాల్లో టెన్త్ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించనున్నారు. తొలి విడతలో సుమారు ఐదు వేలకుపైగా సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ నిధులతో కాకుండా, బండి సంజయ్ వ్యక్తిగతంగా వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి సేకరించిన సీఎస్‌ఆర్ నిధులతో నిర్వహిస్తున్నారు.
ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నేరుగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందేలా ఏర్పాట్లు చేశారు.మొత్తం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 20 వేల సైకిళ్ళు పంపిణీ చేయాలని సంజయ్ అనుకున్నారు. ఇప్పటికే కరీంనగర్ లో 5 వేల సైకిళ్ల పంపిణీ పూర్తవగా, సిరిసిల్ల నియోజకవర్గంలో 5 వేల సైకిళ్ల పంపిణీ ప్రారంభించబోతున్నారు.
దూరం నుండి నడిచి స్కూల్కి వెళ్లే విద్యార్థులకోసం, ముఖ్యంగా టెన్త్ క్లాస్లో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థుల రవాణా భారాన్ని తగ్గించేందుకు ఈ సైకిళ్ల పంపిణీ ఉద్దేశించినట్టు బండి సంజయ్ తెలిపారు. మొదటగా సిరిసిల్ల టౌన్ లో పాటు, తంగళ్ళపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు మాత్రమే పంపిణీ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఈవో, ఇతర ఉన్నతాధికారులతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, ఇతర నాయకులు కూడా పాల్గొననున్నారు.