calender_icon.png 2 August, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక

01-08-2025 06:45:41 PM

అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ..

గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ(Additional Collector Laxminarayana) అన్నారు. శుక్రవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక బుకింగ్ విధానంపై రాష్ట్ర స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణా కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో పేదలకు స్వంత ఇల్లు కల్పించే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రియాశీలకంగా అమలవుతోందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఇళ్లు మంజూరైన లబ్ధిదారులందరికీ ఇసుకను పూర్తిగా ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇసుక లోడింగ్ రవాణా చార్జీలను లబ్ధిదారులు భరించుకోవాలన్నారు.

ఇందిరమ్మ ఇల్లు పథకానికి అవసరమైన ఇసుక సరఫరా కోసం తుమ్మిళ్ల ప్రాంతంలో ఉన్న ఒక ఇసుక రీచ్‌ను గుర్తించినట్లు తెలిపారు. రేట్ చార్ట్‌ను సిద్ధం చేసి,లబ్ధిదారుల జాబితాను త్వరగా సమర్పించినట్లయితే  ఉచిత ఇసుకను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేసేందుకు వీలు పడుతుందని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అందించనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులకు మట్టిని ఇప్పటికే పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇసుక రవాణాకు ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్ల ద్వారా లేదా సొంత ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసుకోవాలని సూచించారు. ఇసుక పక్కదారి పట్టకుండా రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ఈ సమావేశంలో అదనపు  కలెక్టర్ నర్సింగ రావు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ కాశీనాథ్,అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.