01-08-2025 06:48:33 PM
జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు..
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జాప్యం కాకుండా త్వరగా పూర్తయ్యేలా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు(District Additional Collector Narsing Rao) అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశ హాల్ నందు ఇందిరమ్మ ఇండ్లు పురోగతిపై అలంపూర్ నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పంచాయతీ కార్యదర్శులు, అసిస్టెంట్ ఇంజనీర్లు,వార్డ్ అధికారులు లబ్ధిదారులతో ప్రత్యక్షంగా కలిసి, నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్థలాల్లో వెంటనే మార్కింగ్ చేసి, ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయాలని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని తెలిపారు. లబ్ధిదారులు కేవలం కూలీ, ట్రాక్టర్ రవాణా ఛార్జీ మాత్రమే చెల్లించాలన్నారు. ఇళ్ల వివరాలను ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్’ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని మండలాలలో పోస్టల్ పింఛన్ పంపిణీ కూడా నిబంధనల మేరకు సమయానికి,పారదర్శకంగా జరగాలని ఆదేశించారు.గ్రామ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్‌లో వివరాలను ఆన్‌లైన్ నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, డీపీఓ నాగేంద్రం, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయితీ సెక్రటరీలు, తదితర అధికారులు పాల్గొన్నారు.