19-08-2025 12:01:26 AM
-ప్రాజెక్టుల వద్ద నీటి గలగలలు
-గేట్లు ఎత్తివేయడంతో నీరు పరవళ్లు
-పలుచోట్ల రాకపోకలు బంద్
-వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు
-ఆందోళన చెందుతున్న రైతులు
-కామారెడ్డి జిల్లా చెట్లుర్ వద్ద వాగు నీటిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు, గొర్రెలు
-అధికారులు, స్థానిక నాయకుల చోరవతో ఒడ్డుకు చేర్చిన ఎన్‌డీఎస్ బలగాలు
-ఊపిరి పీల్చుకున్న అధికారులు
కామారెడ్డి, ఆగస్టు 18 (విజయక్రాంతి) : నాలుగు ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని శ్రీరాంసాగర్, అలీ సాగర్, నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్ట్, పోచారం ప్రాజెక్టు లు నీరు నిండి గేట్లు తెరవడంతో పరవళ్ళు తొక్కుతున్నాయి. ప్రాజెక్టు ల కింద, మీద ఉన్న పంట పొలాలు వరదనీరుకు నీట మునిగాయి. సోమవారం ఉదయం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లుర్ వద్ద వాగులో నలుగురు గొర్రెల కాపరులు, ఇద్దరు రైతులు, 500 కు పైగా గొర్రెలు నీటిలో గల్లంతయ్యాయి.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్థానిక అధికారులకు జిల్లా కలెక్టర్కు సమాచారం అందించడంతో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో స్థానిక అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని ఎస్ డి ఆర్ ఎస్ బృందాలను తెచ్చి గొర్రెల కాపరులను, రైతులను, గొర్రెలను రక్షించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు తెరవడంతో నీరు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి వరద ప్రభావం లక్ష కు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో 12 గేట్లను తెరిచి నీటిని వదులుతున్నారు. కౌలాస నాల ప్రాజెక్ట్ ఐదు గేట్లను తెరిచారు. పోచారం ప్రాజెక్టు నుండి నీరు ప్రవహిస్తుండడంతో పోచారం ప్రాజెక్టు పైన, కింద ఉన్న వరి వైరు నీట మునిగ డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.
నిజాంసాగర్ ప్రాజెక్టు సమీపంలోని అచ్చంపేట గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. బాన్సువాడ గాంధారి రహదారిపై సర్వాపూర్ వద్ద ప్రవహిస్తున్న నీటితో రాకపోకలు నిలిచిపోయాయి. గాంధారి లింగంపేట్ వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు లు వెళుతున్నాయి. ఎక్కడ చూసినా నీటితో కలలాడుతున్నాయి. పంటలు నీటము ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీటిని తొందరగా వదిలితే నీట మునిగిన పంటలు తేలుతాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కు నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, రైతులు కోరారు. జుక్కల్ నియోజకవర్గం లో బిచ్కుంద, మద్నూర్, మహమ్మద్ నగర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో పలుచోట్ల వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
రైతులకు నష్టపరిహారం అందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువానుకు కోరారు. పంట. నష్టం వివరాలను తయారుచేసి ప్రభుత్వానికి నివేదించాలని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారం వచ్చేలా రైతులను ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు అన్నీ నిండి జల కలను సంతరించుకున్నాయి. చేపలు పట్టేవారు, రైతులు, రైతు కూలీలు, గొర్రెల కాపర్లు, వాగులు దాటి వెళ్ళవద్దని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ వాన్ చొరవ తీసుకొని నష్టపరిహారం వివరాలను జిల్లా అధికారుల నుంచి సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని జిల్లాలోని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యాన్ని కల్పించారు. నష్టపరిహారం ప్రభుత్వం నుంచి వచ్చే చర్యలు తీసుకుంటామన్నారు.
నిజాంసాగర్ 13 వరద గేట్ల ఎత్తివేత
నిజాంసాగర్, ఆగస్టు 18 ః నిజాంసాగర్ ప్రాజెక్టు 13 వరద గేట్ల ద్వారా 85000 వేల క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నది లోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈ ఈ సోలోమన్ తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్టుపైకి అనుమతి లేదు
నిజాంసాగర్ ఆగష్టు 18 ః నిజాంసాగర్ ప్రాజెక్టుపై సందర్శకులకు అనుమతి లేదని బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతిపేర్కొన్నారు. ఆయన సోమవారం నాడు నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద విలేకరుల తో మాట్లాడుతూ ప్రాజెక్ట్ భద్రత తో పాటు ఎలాంటి ప్రమాదాలకు చోటు ఇవ్వరాదని ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టుపై సందర్శకులకు అనుమతి నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట నియాన్సర్ ఎస్సు శివకుమార్ ఉన్నారు.