calender_icon.png 1 October, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక లారీల వల్ల దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలి

01-10-2025 12:00:00 AM

తక్షణమే తాత్కాలికంగా రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి

ఇసుక లారీలను నిలుపుదల చేయాలి

భద్రాచలం సబ్ కలెక్టర్‌కు సీపీఎం పాదయాత్ర బృందం వినతి

భద్రాచలం, సెప్టెంబర్ 30, (విజయ క్రాంతి): భద్రాచలం నుండి వెంకటాపురం వరకు దెబ్బతిన్న ప్రధాన రహదారి పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీ భద్రాచలం, చర్ల,దుమ్ముగూడెం మండల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర బృందం నాయకులు భద్రాచలం సబ్ కలెక్టర్ ను మంగళవారం కలసి వినతి పత్రం అందజేశారు..

ఈ సందర్భంగా పాదయాత్ర రథసారథి పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భద్రాచలం నుండి వాజేడు వరకు నేషనల్ హైవే ప్రధాన రహదారి పై అధిక లోడుతో ఇసుక లారీలు ప్రయాణం చేయడం వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు.

భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలు ఈ ప్రధాన రహదారిపై ప్రయాణం కొనసాగిస్తున్నారని, విద్యా, వైద్యం, వాణిజ్యం కొరకు ప్రజలు ప్రయాణించే ఈ ప్రధాన రహదారి గుంతలు ఏర్పడి తీవ్రంగా దెబ్బతినడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్టీసీ యాజమాన్యం ఈ రూటులో బస్సులు నడపలేక అనేక బస్సులను రద్దు చేసిందని అన్నారు.

గుంటలు ఏర్పడ్డ రోడ్డుపై మోటార్ సైకిల్ వాహనాలు ఆటోలు ప్రమాదాలకు గురై వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారని శతఘాతులయ్యారని అన్నారు. సిపిఎం పార్టీ ఈ సమస్య పరిష్కారం కోసం దఫ దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం గానీ ఉన్నతాధికారులు గాని పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. అందుకోసమే ప్రభుత్వంలో కదలిక తెచ్చేదానికోసం ఉద్యమూరు మండలం లక్ష్మీనగరం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టామని అన్నారు.

ఎన్నికల కోడ్ తో పూర్తిస్థాయిలో పాదయాత్ర జరగకపోయినా సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. తక్షణమే ఈ ప్రధాన రహదారి పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని, వెంటనే రహదారి మరమ్మత్తులు చేయాలని ఇసుక లారీలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జే రమేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య,ఎంబీ నర్సారెడ్డి, వేపాకుల శ్రీనివాస్, భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగా,భుఖ్య రమేష్, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు సభ్యులు డి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.