calender_icon.png 29 May, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిత కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి

27-05-2025 08:26:08 PM

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..

భవిత కేంద్రాల నిర్వహణ, బడిబాటలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్..

ఖమ్మం (విజయక్రాంతి): జిల్లాలోని భవిత కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్(District Collector Muzammil Khan) తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో భవిత కేంద్రాల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ(Additional Collector Dr. P. Sreeja)తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 8 భవిత కేంద్రాలు, 14 నాన్ భవిత కేంద్రాలు ఉన్నాయన్నారు. రాబోయే 20 రోజుల్లోపు 8 భవిత కేంద్రాల్లో టాయిలెట్లు, వాష్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఆకర్షణీయ పెయింటింగ్ వేయాలన్నారు. కేంద్రానికి కావాల్సిన పరికరాలు సమకూర్చాలన్నారు.

ఎంత మంది పిల్లలకు రవాణా సౌకర్యం కావాలో గుర్తించి, రవాణా సౌకర్యానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో బడి బాట కార్యక్రమం పకడ్బందీగా కార్యాచరణ చేయాలన్నారు. జీరో నమోదు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇంటింటికి వెళ్లి, తల్లిదండ్రులతో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, బోధనపై చైతన్యం తేవాలన్నారు. పాఠశాలల్లో మిగులు వసతుల కల్పన పనులు వెంటనే చేపట్టాలన్నారు. రి పెయింటింగ్, టాయిలెట్లు, సుందరీకరణ పనులు ఉంటే బడి బాట కార్యక్రమానికి ముందే చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.సత్యనారాయణ, సీఎంఓ రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.