26-01-2026 01:17:01 AM
ఆధునిక కాలంలో భగవంతునికి, పూజకు, ఆరాధనకూ ఆధ్యాత్మిక అంశాలకు చెంది న హిందూ ధార్మిక పదాలను తెచ్చి పెడార్థాల్లో ప్రయోగించే ఒక అథమమైన ప్రక్రియ మానవాళిలోకి ప్రవేశించింది. ఎంతో చదువుకున్నవారు, తమ ధర్మాన్ని ప్రేమించేవారు కూడా తమకు తెలియకుండానే ఆ పదాలను వాడుతున్నారు. ఆ పెడ ధోరణు లు సినిమాల ద్వారా మీడియా విధానాల ద్వారా, ప్రచార సాధనాల మాధ్యమంగా జనబాహుళ్యంలోకి వచ్చాయి. అలాంటి పదప్రయోగాలు ధర్మాని కి అవమానకరం. అంతేకాదు.. భాషకు ఉన్న సాహి త్య, ఆధ్యాత్మిక, ధార్మికవిలువలు దిగజార్చ డం.
ఆధ్యాత్మిక బలం కలిగించి, సంస్కృతికి దర్పణాలైన చక్కని భావాలను ఇలా నీచమైన, హేయమైన అరాల్లో వాడటం ఏమాత్రం సరికాదు. చక్కని తెలుగు పదాల్లో చేరిన ఈ భావకాలుష్యాన్ని గుర్తిం చి, ఇప్పటికైనా పెడ ధోరణులకు స్వస్తి పలికే ప్రయత్నాలు మొదలవ్వాలి. కనీసం కొందరైనా ఆ పదాల వాడకం గురించి తెలుసుకుని ఆ ప్రయోగాలను వాడటం తపు అని ఎదుటివారితో చెప్పగలగాలి. ఆ మంచి పదాలెంటో.. వాటికి పెడఅర్థాలు ఎలా జానబాహుళ్యంలో నానుతున్నాయో తెలుసుకుందాం!
భాగవతం (బాగోతం) -- భాగవతమంటే భగవంతునికి, ఆయన భక్తులకు చెందిన చక్కని కథలు. ఆధ్యాత్మిక అంశాల నెలవు.
ఈ పదాన్ని ‘నేరం, జుగుప్స కలిగించే ఉదంతం’ అని చెప్పటానికి వాడుతున్నారు. ఉదాహరణకు ‘ఈ బాగోతం బయటకు వచ్చింది.. ఎన్నాళ్లుగా సాగోతోంది ఈ బాగోతం?’ అంటూ అసహ్యకరమైన సన్నివేశాలకు ఈ మాటను ప్రయోగించటం వ్యాస భాగవతానికి అవమానకరం.
కుంభకోణం: కుంభకోణం తమిళనాడులోని ఒక దివ్య తీర్థక్షేత్రం. ఈ పదాన్ని పెద్ద ఎత్తున మోసపూరిత కార్యం అన్న అర్థంలో వాడుతున్నారు.
సోది: సోది ఒక దివ్యదృష్టితో భవిష్యత్తు చెప్పే పారంపరిక ప్రక్రియ. దానికి సంబంధించిన నియమాలు, పద్ధతులు అనాదిగా ఉన్నాయి. ఈ పదాన్ని ‘అనవసరమైన మాటలు, అసంబద్ధ ప్రేలాపనలు’ అనే అర్థానికి వాడుతున్నారు. ‘ఊరికే సోది పెట్టకు’ అంటూ ఆ పదాన్ని వాడటం విచారకరం.
కైంకర్యం: కైంకర్యం అంటే భక్తిభావంతో తమ ఇష్టంతో భగవంతునికి సమర్పణం చేసే వస్తువు. సేవ ఈ పదానికి అసలు అర్థం. ఇది ఆలయ పరంపరలోని పదం. దీన్ని ‘ఏదైనా తమకు చెందని వస్తు వును, ఆస్తిని, లేదా ధనాన్ని తమ స్వంతం కోసం వాడుకునేందుకు అనైతికంగా తీసేసుకోవటం’ అనే అర్థానికి వాడుతున్నారు.
తీర్థం పుచ్చుకోవటం: ఇది గుడిలో దేవునికి సమర్పించి, భక్తులకు ఇచ్చే తులసి నీరు, పాలు, కొబ్బరి నీరు, లేదా కర్పూరాదులు కలిపిన పానీ యం.ఈ పదాన్ని ‘మద్యపానానికి, కల్లు తాగటానికి’ బదులుగా వాడుతున్నారు. ఎంత అసహ్యకరం.
ప్రేమాయణం: రామాయణం అనే మాటను ప్రేమాయణంలా మార్చి వాడుతున్నారు. స్త్రీ, పురుషులు పరస్పరం ఏరకమైన ఆకర్షణకు లోనైనా దాన్ని ప్రేమ అనుకోవటం కద్దు. అటువంటి వాటి ల్లో కొన్నిసార్లు హేయమైన సంబంధాలు ఏర్పడుతుంటాయి. వాటికి కూడా ఈ పదాన్ని వాడటం చాలా కష్టకరంగా ఉంటుంది.
ఎగనామం పెట్టటం, పంగనామం పెట్టటం: - ఇవి వైష్ణువుల ఆచారం చూపించే ఒక సంకేతం. నుదుట పెట్టే మూడు నిలువు గీతలు. వాటిని తిరునామాలు అంటారు. ఆ పదాన్ని ‘బడికి పోకుండా ఇంట్లో ఉండటం, తప్పించుకుపోవటం, చెప్పకుం డా మానేయడం, తీసుకున్న రుసుము చెల్లించకపోవడం’ వంటి అర్థాల్లో వాడి అవమానిస్తున్నారు.
నైవేద్యాలు: నైవేద్యాలు - భగవంతునికి భక్తితో సమంత్రంగా ఇచ్చి, తరువాత భక్తులు సేవించే ఆహారం ఈ పదానికి అర్థం. దాన్ని సామాన్యంగా తినే అన్నానికి వాడటం తప్పు. మా ఇంట్లో ఇంకా నైవేద్యాలు కాలేదు.. అంటే మేమెవ్వరం ఇంకా అన్నాలు తినలేదు, మా భోజనాలు కాలేదని అర్థం. చివరకు లంచాలు తీసుకోవటంలో కూడా ఈ పదం ప్రయోగం కనిపించడం విచారకరం.
ఊరేగటం: దీని అర్థం భగవంతునికి చేసే వాహ న సేవ. సామాన్యులు చూడటానికి అనువుగా ఆయన విగ్రహాలను నగర సందర్శనం చేయించటమే ఊరేగింపు. ఈ పదాన్ని ‘ఏ పనీ లేకుండా గాలి కి తిరగటం’ అనే అర్థానికి, ఏ ప్రయోజనం లేకుం డా సమయం గడుపుతూ, ఇంటి బయట కాలక్షేపం చేయటం అనే అర్థానికి వాడుతున్నారు. ‘ఇంతసేపు ఎటు ఊరేగి వచ్చావు..?’ అంటూ దెప్పి పొడవటానికి వాడుతున్నారు. ‘ఊరేగించుట’ అన్నది తెలియ క జానపదులు అనేమాట. మనం భగవంతుడి విషయంలో ఆ పదం వాడకూడదు.
స్వాహా: ఇది స్వాహా అనేది ఒక పవిత్రమైన మం త్రం. స్వాహాదేవి అగ్నిదేవుని భార్య. ‘అగ్నియే స్వా హా,’ అని ‘ఇంద్రాయ స్వాహా’ అని హవిస్సును ఆయా దేవతలకు చెందింపచేసే వాక్కు. ఈ పదాన్ని ‘అవినీతిగా, తనకు చెందని ధనం తస్కరించటం’ అనే అర్థానికి బదులుగా వాడుతున్నారు. ‘భూము లు స్వాహా చేశారు.. గనులు స్వాహా చేశారు..’ వంటి అతి నీచమైన అర్థంలో వాడకం కనిపిస్తున్నది.
పురాణం: పురాణాలు వ్యాసుడు రచించిన అమూల్య జ్ఞాన భాండాగారాలు. వాటిని ప్రజల ధార్మిక ఉద్బోధ కోసం వాడారు. కానీ, ఇప్పుడు అతి నీచమైన వ్యవహారాలకు ‘బూతు’ అనే పదం కూడా చేర్చి పురాణ శబ్దాన్ని వాడుతున్నారు.
పురాణ కాలక్షేపమా, హరికథా కాలక్షేపమా: పురాణం విన్నట్టు - పురాణాలు, హరికథలు కూడా మహాపురుషుల కథలను, భాగవదంశాలను శ్రద్ధగా వినటానికి, ఆలోచించి ఆచరణలో పెట్టే మంచి విషయాలను సులువుగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో అందించే ప్రయత్నం. పురాణం కూడా ఏం ఊరికే విని వదిలేసేది కాదు. మహర్షుల ఆలోచనా విధానాన్ని పట్టుకుంటే జీవితంలో చాలా ఉత్తమమైన సాధనమార్గంలో సులువుగా ప్రవేశించవచ్చు. కానీ, దాన్ని విద్యార్థి పాఠం వినకపోతే ఇదేం పురాణకాలక్షేపమా విని మర్చిపోవడానికి? లేదా, హరికథలాగ వింటే ఏమీ అర్థం కాదు.. అంటూ దెప్పిపొడవటానికి వాడుతున్నారు.
పతివ్రత: భర్తే తన సర్వస్వంగా భావించి, ఆయ న సేవే తన వ్రతంగా కలిగిన స్త్రీ. కానీ, ఇప్పుడు ఈ పదాన్నే ఎంతో అసహ్యకరంగా సరిగ్గా విరుద్ధార్థం లో వాడుతున్నారు. భర్తను గణించక, వివాహేతర సంబంధాలు పెట్టుకునే స్త్రీ వరకు చాలా హేయమైన అర్థాలను ఈ పదానికి ఆపాదించారు.
విశ్వరూపం: ఇది భగవంతుని సమగ్రమైన తత్త్వాన్ని ప్రతిపాదించే రూపం. నిర్వస్త్రంగా ఉండటం అనే అర్థానికి ఈ పదాన్ని వాడుతున్నారు. విశ్వరూపసందర్శన యోగం అని భగవద్గీతను వినేవేళ అలాంటి అర్థాలు స్ఫురించటం విచారకరం.
ఛాదస్తం: ఛాందసం అనే మాటకు వికృతి. ఛందస్సు అంటే వేదం అని ఒక అర్థం. వైదికభావాలు కలిగి ఉండటాన్ని ఛాందసం అంటారు. కానీ, ఇప్పుడు ఇదే పదం ‘పాతభావాలు పట్టుకుని వేలాడటం, ధర్మం, న్యాయం, నీతి నియమం’ అని మా ట్లాడటా’నికి వాడుతున్నారు. పాతభావాలు అన్నీ వర్జ్యాలు కాదు. కొత్తది అంతా సరైనది అనీ కాదు.
గోవిందా గోవిందా..: గోవిందా గోవిందా..అని భక్తితో భక్తులు తమ వేంకటేశ్వరుని తలచుకుంటారు. కొండ ఎక్కుతూ స్మరణ చేస్తారు. గోవింద నామం అన్ని నామాలలో ప్రశస్తమైనదని భావిస్తారు. కానీ ఇప్పుడు అదే పదం ‘దొంగిలించిన వస్తువు’ కోసం ప్రయోగిస్తున్నారు. ఇంకేముంది.. అంతా గోవిందా.. అంటూ గోవిందను ‘దొంగిలించిన వ్యక్తికి సమర్పించటం’ అనే అర్థంలో వాడటం హేయం.
సంకా ఉషారాణి
(సోషల్ మీడియా నుంచి సేకరణ)