calender_icon.png 30 October, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్లీకో లీడర్

30-10-2025 12:47:33 AM

  1. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ మోహరింపు
  2. రోడ్డు షోలు, బైక్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 28(విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌ను హస్తగతం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ఇతర సీనియర్లలను నియోజకవర్గంలో మోహరించింది. హైదరాబాద్‌లో జరిగే రెండో ఉప ఎన్నికలోనూ పాగా వేయాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ప్రచారంలో వేగం పెంచింది.

ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలుపొందిన కాంగ్రెస్, ఇప్పుడు జూబ్లీహిల్స్ సైతం తన ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతున్నది. ఇందుకు గల్లీకో లీడర్, డివిజన్‌కో ఇద్దరు మంత్రులకు ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. 200 ఓట్లకు ఒకరికి బాధ్యతల ను కూడా అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, బైక్ ర్యాలీలలో సీఎం పాల్గొననున్నారు.

పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పార్టీ సీని యర్లు జూబ్లీహిల్స్‌పై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇంటలిజెన్స్‌తోపాటు ప్రైవేట్‌గా కూడా ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పోలింగ్ రోజు వరకు అప్రమత్తంగా ఉండి.. పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను గెలిపించుకునేందుకు బీసీ వాదాన్ని కూడా ముందుకు తీసు కొస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న పాలమూరు జిల్లా వాసులతో సమావేశం నిర్వహించి కాంగ్రెస్‌కు అండగా ఉండాలని కోరారు.

ప్రచార అస్త్రాలుగా అభివృద్ది, సంక్షేమం..

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నెల రోజుల క్రితమే ముగ్గురు మంత్రులు తుమ్మ ల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిని ఇన్‌చార్జ్‌లుగా నియమించిన విషయం తెలిసిందే. వీరు నియో జకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నా రు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నా రు. ఇప్పుడు ఏకంగా ప్రతి డివిజన్‌కు ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించడం ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌పై ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు చేస్తున్న  ఆరోపణలను పార్టీ నేతలు తిప్పికొడుతూ ప్రచారహోరును పెంచుతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విషయంలో గులాబీ నేతలు సెంటిమెంట్‌ను ప్లే చేస్తుండగా, అందుకు ధీటుగా కాంగ్రెస్ నేత లు బీసీ కార్డును తెరపైకి తీసుకొస్తున్నారు.

మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ నియోజకవర్గానికి చేసిందేమిలేదనే విమర్శలతో ముందుకెళ్లుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున, ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, ఆయా డివిజన్లలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు.

డివిజన్లవారీగా మంత్రులు  

నియోజకవర్గ బాధ్యతలను ఇప్పటికే ముగ్గురు మంత్రులకు అప్పజెప్పిన కాం గ్రెస్ పార్టీ, ఇక ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. రహమత్‌నగర్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  బోరబండకు సీతక్క, ఎంపీ మల్లు రవి,  వెంగల్‌రావునగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సోమాజిగూడకు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, షేక్ పేటకు కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డకు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, యూసుఫ్‌గూడకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు.

వీరితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్లు, ఇతర నాయకులు నియోజకవర్గవ్యాప్తంగా పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు.