23-12-2025 12:04:42 AM
ఏకగ్రీవ సర్పంచ్ లక్ష్మారెడ్డి
భీమదేవరపల్లి ,డిసెంబర్ 22 (విజయక్రాంతి): నూతన పాలకవర్గ సభ్యులతో కలిసి గాంధీనగర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేయనున్నట్లు గాంధీనగర్ ఏకగ్రీవ సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి తెలిపారు. గాంధీనగర్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గ్రామ ప్రత్యేక అధికారి నాగరాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ముందుగా సర్పంచ్ లక్ష్మారెడ్డి తో పాటు పాలకవర్గ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా గ్రామపంచాయతీ భవనానికి చేరుకున్నారు.
అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు తరలివచ్చి సర్పంచ్ తో పాటు నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలకవర్గం, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వివరించారు. తనను ఏకగ్రీవంగా గెలిపించినందుకు మరోసారి గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి నాగరాజు, ఉప సర్పంచ్ బుర్ర సమ్మయ్య, కార్యదర్శి భాస్కర్ వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ లు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యూత్ నాయకులు, మహిళలు పాల్గొనారు.