calender_icon.png 31 July, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగదు ఇచ్చుకో.. దర్జాగా వెళ్లిపో?

06-12-2024 12:26:12 AM

  1. అవినీతికి అడ్డాలుగా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు 
  2. అక్రమ రవాణా అడ్డుకట్ట వేయాల్సిన చోటే అక్రమ దందా 

గద్వాల (వనపర్తి), డిసెంబర్ 5 (విజయక్రాంతి): అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు అవినీతికి అడ్డాలుగా మారాయి. నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి పన్నులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన సిబ్బంది తమ జేబులను నింపుకుంటున్నారు.

గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై గల తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు అవినీతికి కేరాఫ్‌గా మారింది. చేయి తడపనిదే ఆ చెక్‌పోస్టు దాటి వాహనం వెళ్లే పరిస్థితి ఉండబోదన్న రీతిలో వసూళ్ల దందా నడుస్తున్నది. అక్రమ రవాణా అయినా, సక్రమ రవాణా అయిన సరే ముడుపులు ముట్ట జెప్పాల్సిందే. లేదంటే ఓవర్‌లోడ్, ఇతర కారణాలను సాకుగా చూపి వాహనాన్ని సీజ్ చేస్తారు. 

రూ.4 వేలు ముట్టజెప్పాల్సిందే?

అక్రమ సరుకులు, మద్యం, ఇతరత్రా జీరో దందాకు సంబంధించిన వాహనాలు చెక్‌పోస్టు దాటాలంటే ఒక్కో వాహనానికి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు సిబ్బందికి ముట్టజెప్పాల్సిందే. ఇతర రాష్ట్రం నుంచి అక్రమంగా జిల్లాల్లోకి ప్రవేశిస్తున్న వాహనాలను ముడుపులకు ఆశపడి వాహనాలను తనిఖీ చేయకుండానే వదిలిపెడుతున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి.

ఇతర రాష్ట్రం నుంచి వస్తున్న వాహనంలో ఉన్న సరుకుకు సంబంధించి జీఎస్టీ, కొనుగోలు, రవాణా అనుమతి, బార్డర్ టాక్స్, టెంపర్వరీ పర్మిట్ ఫీజు, అపరాధ రుసుం, వాహన ఇన్సూరెన్స్ ఇతర పన్నుల చెల్లింపు పత్రాలు ఉండాలి. వీటిలో ఏ పత్రాలు లేకున్నా సంబంధిత శాఖ ఆ వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేయడంతో పాటు చెల్లింపులను జరిమానాతో విధించాలి.

కానీ అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ చెక్‌పోస్టు సిబ్బంది ప్రతి వాహనం వద్ద రూ.500 నుండి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జీరో దందాకు అలవాటు పడిన వ్యాపారులు చెక్‌పోస్టుల వద్ద విధులను నిర్వహించే కొంతమంది అధికారులను మచ్చిక చేసుకుని మాముళ్ల మత్తులో పెట్టి దందా చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అక్రమ రవాణా జరుగుతున్న వాటిలో ప్రధానంగా నిత్యావసర సరుకులు, పీడీఎస్ బియ్యం పెద్ద ఎత్తున ఉన్నట్టు తెలుస్తున్నది. 

గద్వాల చెక్‌పోస్టుకు డిమాండ్ 

గద్వాల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పని చేసేందుకు రాష్ట్రస్థాయిలో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక్కసారి ఇక్కడ విధులు నిర్వహిస్తే చాలు అందినకాడికి దోచుకుని మూటలు కూడబెట్టుకోవచ్చు అనే దురాశతో అధికారులు, పోలీసులు ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఈ మేరకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సైతం తాయిలాలు ఇచ్చి అడిగి మరి గద్వాల చెక్‌పోస్టు వద్ద డ్యూటీ వేయించుకుంటారన్న విమర్శలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. 

ఏసీబీ దాడులతో బట్టబయలు 

గద్వాల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద కొంతమంది అధికారుల చేతివాటం ఏ స్థాయిలో ఉందో ఈ నెల 4వ తేదిన ఏసీబీ అధికారుల దాడులతో బట్టబయలు అయ్యింది. గతంలోనూ ఇక్కడ దాడులు జరిగి పలువురిపై కేసులు నమోదు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది అధికారుల తీరు మాత్రం మారడం లేదు.

వాహనాలను తనిఖీ చేసి జరిమానా విధించాల్సిన స్థాయిలో ఉన్న ఏఎంఐ అధికారులతో పాటు కానిస్టేబుల్, హోంగార్డులకు వాహనదారులు తాయిలాలు అందిస్తున్న నేపథ్యంలో నేరుగా ఏసీబీ అధికారులు దాడులు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.