calender_icon.png 5 July, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గయ్యాలి అత్తగా!

01-06-2025 12:00:00 AM

లలితా పవార్.. బాలీవుడ్ గయ్యాలి అత్తగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. అంతేకాదు ఆమెది చూడచక్కని ముఖం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేది. లలిత మంచి నటి మాత్రమే కాదు.. మంచి గాయని కూడా. 1935లో వచ్చిన ‘హిమ్మతే మర్దాన్’ మూవీలో ఆమె పాడిన ‘నీల్ అభా మే ప్యారా గులాబ్ రహే, మేరే దిల్ మే ప్యారా గులాబ్ రాటే’ పాటకు అభిమానులు ఇప్పటికీ ఉన్నారంటే అతిశయోక్తి.  

లలిత తెరపై ప్రతికూల పాత్రలు పోషించినప్పటికీ ఆమె నిజ జీవితంలో చాలా భిన్నమైన, సానుకూలమైన భావాలు గల వ్యక్తి. ఆమె జీవితం ఎన్నో ఆటుపోట్లతో, సవాళ్లతో కూడుకున్నది. రీల్ లైఫ్‌లో గయ్యాలిగా గుర్తింపు ఉన్న.. రీయల్ లైఫ్ మాత్రం మృదుస్వభావి. లలితా పవార్ అసలు పేరు అంబ లక్ష్మణ్ రావు. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 12 ఏళ్ల వయసు లో మూకీ చిత్రాల్లో నటించింది.

మొదటి చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’. ఈ చిత్రంలో లలిత పాత్రకుగాను మొదటి జీతం రూ.18. 70 ఏళ్ల కెరీర్‌లో 700 వందలకు పైగా చిత్రాల్లో నటించింది. ము ఖ్యంగా తల్లి పాత్రలో.. గయ్యాలి అత్తపాత్రకు న్యా యం చేసి.. ప్రేక్షకుల మదిలో తిరుగులేని ముద్రవేసింది.

ఆమె నటనను ఇతరులతో పోల్చలేం. ‘జంగ్లీ’, ‘ఫూల్ ఔర్ పత్తర్’, ‘నౌకర్’, ‘సౌ దిన్ సాస్ కే‘, ‘ఘర్ సంపార్’ వంటి చిత్రాల్లో ఆమె అద్భుతమైన నటను ప్రదర్శించింది. ప్రతి పాత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును చాటుకున్నది.  

చేదు అనుభవం

లలిత 1940లో హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో హీరోయిన్‌గా సినిమాలు చేసింది. కైలాష్ (మూకీ చిత్రం), దునియా క్యాహై (టాకీ) చిత్రాలకు నిర్మాతగాను వ్యవహరించింది. ఆమెకు వెండితెరపై తిరుగులేదు అనుకునే సమయంలో ఓ చేదు ఘటన జరిగింది. 1942లో ‘జంగ్ ఇ ఆజాద్’ సినిమాలో నటుడు మాస్టర్ భగవాన్.. ఆమె చెంప చెళ్లుమనిపించాడు.

సీన్ బాగా రావాలంటూ ఎంతో గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె చెవి నుంచి రక్తస్రావమైంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫేషియల్ పెరాలసిస్ (ముఖానికి పక్షవాతం) వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎడమ కన్ను కూడా దెబ్బతిన్నట్లు అయినట్లు తెలిపారు. అలా మూడేళ్లు ఇంటికే పరిమితమైంది. తర్వాత చాలాకాలం వరకు ఒంటికన్నుతోనే సినిమాలు చేసింది. 

వైద్యం వికటించడంతో.. 

వైద్యుల చికిత్స వికటించడం వల్లే తనకు శరీరం కుడివైపు కూడా పక్ష వాతం వచ్చిందని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం తర్వాత తనకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ అన్నీ ప్రతికూల పాత్రలే. అయినా పాత్రలకు ప్రాణం పెట్టి చేసింది. గయ్యాలి అత్తగా, కుట్రలు కుతంత్రాలు చేసే దుష్టురాలిగా భయపెట్టింది.

అనాది, శ్రీ 420, గోర కుంభర్.. ఇలా అనేక చిత్రాలతో దాదాపు ఏడు దశాబ్దాలపాటు సినీ ప్రియులను అలరించింది. రామాయణం సీరియల్‌లో మందరగా నటించింది. 70 ఏళ్లపాటు ఇండస్ట్రీలో రాణించిన నటిగా గిన్నిస్ రికార్డుకెక్కింది. 

విడాకులకు కారణం

లలిత నిర్మాత గణపత్‌రావును పెళ్లాడింది. కానీ అతడు లలిత సొంత చెల్లితోనే వివాహేతర సం బంధం పెట్టుకోవడంతో భరించలేకపోయింది. విడాకులిచ్చేసింది. అనంతరం నిర్మాత రాజ్ గుప్తా ను పెళ్లాడింది. వీరికి జై పవార్ అనే కుమారుడు ఉన్నాడు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో లలితకు నోటి క్యాన్సర్ వచ్చింది.

అప్పటి వరకు ముంబైలోనే ఉన్న ఆమె చికిత్స కోసం పుణెకు షిఫ్ట్ అయింది. నెగిటివ్ క్యారెక్టర్స్ పోషించడం వల్లే తనకు ఇలా జరిగిందని లోలోపలే మథనపడింది. అలా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో 1998లో పుణెలో కన్నుమూసింది.