calender_icon.png 24 December, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 252ను సవరించాలి!

24-12-2025 02:05:09 AM

  1. రిపోర్టర్లకు ఒకలా.. డెస్క్ జర్నలిస్టులకు మరోలా కార్డులు సరికాదు
  2. అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి
  3. సమాచార శాఖ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్‌కు హెచ్‌యూజే, టీడబ్ల్యూజేఎఫ్ వినతి

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాం తి): జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో 252లో అనేక లోపాలున్నాయని, వెంటనే వాటిని సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని హెచ్‌యూజే, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మంగళవారం సమాచార శాఖ డైరెక్టర్ కిషోర్‌బాబు, అడిషనల్ డైరెక్టర్ జగన్‌ను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.

కొత్తగా అక్రిడిటేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. అయితే జీవోలో ఉన్న కొన్ని నిబంధనలు జర్నలిస్టులను గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 252లో జర్నలిస్టులను రెండు వర్గాలుగా విభజిస్తూ పాలసీ నిర్ణయం జరిగిందని, ఇది సరికాదని ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు.

రిపోర్టర్లకు అక్రిడిటేషన్ అని, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు అని పేర్లు పెట్టి విభజించడం వల్ల డెస్క్‌లో పనిచేసేవారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటి కే కేంద్రం తీరుతో రైల్వే పాసులు పోయాయని, ఆర్టీసీ రాయితీ కూడా తగ్గించారని గుర్తు చేశారు. ఇప్పుడు మీడియా కార్డు పేరు తో డెస్క్ జర్నలిస్టులకు బస్‌పాస్ సౌకర్యం బంద్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. డెస్కు జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కొత్త నిబంధనల వల్ల చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రిడిటేషన్లు దక్కకుండా పోతున్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే భారీగా కార్డుల సంఖ్యను తగ్గించారని, దీనివల్ల వందలాది మంది వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాల్సిందేనని హెచ్‌యూజే, టీడబ్ల్యూజేఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.

జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్లుగానే జర్నలిస్టులకు కూడా ఆరోగ్య విధానాన్ని (హెల్త్ స్కీమ్) అమలు చేయాలని హెచ్‌యూజే, టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. కాగా, దీనిపై స్పందించిన అడిషనల్ డైరెక్టర్ జగన్ .. మీడియా కార్డుల కు, అక్రిడిటేషన్ కార్డులకు ఒకే రకమైన సౌకర్యాలు ఉంటాయని చెప్పారు.

డెస్క్ జర్నలి స్టులకు బస్‌పాస్ ఉండదనేది అసత్య ప్రచారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అడ్ హక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, హెచ్‌యూజే కార్యదర్శి జగదీశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ఉపాధ్యక్షులు దామోదర్, డెస్కు జర్నలిస్టులు ఉపేం దర్, మస్తాన్, సురేష్, కిరణ్, నరేష్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.