calender_icon.png 8 November, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతకు దేవుడే దిక్కు..!

08-11-2025 12:00:00 AM

  1. సర్కార్ సాయం మాటలకే పరిమితం
  2. పంట నష్టపరిహారం కోసం ఎదురుచూపులు
  3. పంటలు వేసే సమయం వచ్చినా పరిహారం రాలే..
  4. రాష్ట్రంలో రైతుల దైన్యం

ఎల్లారెడ్డి, నవంబర్ 7 (విజయక్రాంతి) : భారీ వర్షాల వల్ల నీట మునిగి పంట పొలాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వ పెద్దల హామీలు నీటి మూటలు గాని మిగిలాయి. నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వేసిన పంటలు పూతలకు వచ్చిన నష్టపరిహారం జాడ కనిపించడం లేదని రైతులు అంటున్నారు. వరి పొలాలలో ఇసుక మేటలు వేసి తీవ్రంగా నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.

దిక్కుతోచని స్థితిలో రైతులు.. 

పంటనష్టం వల్ల అప్పులు తీర్చలేక కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వేసిన పంటలు ఏపుగా పెరడంతో యూరియా, ఇతర రసాయన ఎరువుల కోసం పెద్దమొత్తంలో ఖర్చు పెట్టారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో అంతా వర్షం పాలైంది. కామారెడ్డి జిల్లాలో వర్ష ప్రభావం తో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరగడంతో అన్నదాత ఊహించని రీతిలో తీవ్రంగా నష్టాల పాలు కావాల్సి వచ్చింది.

ఇసుక మేటలు వేసి, పంటలు నీట మునిగి, నేలకొరిగి, మురిగిపోయి అన్నదాతలు భారీగా నష్ట పోయారు. పంట నష్టం అంచనా వేసిన అధికారులు నివేదికలను ప్రభుత్వానికి పంపినా, నష్ట పరిహారం విషయంలో స్పష్టమైన ప్రకటనేది ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. దీంతో పంటలు నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదిరుచూస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేట, లింగంపేట,తాడ్వాయి, మండలంలోని పలు గ్రామాలలో చేతికొచ్చిన పంట పొలంలో బారి వరదల కారణంగా నీటమునిగి,పంట మురిగిపోయింది.

కామారెడ్డి జిల్లాలోని మూడు నెలల క్రితం కురిసిన అతి భారీ వర్షాలకు 270 మండలాల పరిధిలోని 2,463 గ్రామాల్లో 2.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సెప్టెంబర్ నెలాఖరులో కురిసిన వానలకు,ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి, జిల్లాలో వేల ఎకరాల్లో వరి, పంటలు నీటిలో మునిగినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వీటికి పంట నష్ట పరిహారం ఇచ్చే అంశంపై ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం విత్తనాలు, కూలీలు, ట్రాక్టర్, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని వాటిని చెల్లించి పంటలు వేశామని తీరా చేతికందే సమయానికి వర్షాలకు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై, ఆగస్టులో కురిసిన వానలకు కామారెడ్డి,జిల్లాలోని రైతులు తీవ్ర నష్టపోయారని,ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు కృషి చేయాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు.

ఇసుక మేటలు వేసినా పరిహారం ఎప్పుడు..? 

భారీ వర్షాల వల్ల వరి పొలాలలో ఇసుక మేటలు వేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ రైతులను కూడా ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు వేల ఎకరాలలో వరద నష్టం జరిగింది. కాగా ఇసుక మేట వేసిన పంట పొలాలు ఈ ఏడాది మొత్తం పంట నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక మేటలు వేసి పంట ఆనవాళ్లు లేకుండాపోయాయి.

ముఖ్యంగా ఎల్లారెడ్డి డివిజన్‌లోని  అనేక గ్రామాలలో నేటికీ పంట పొలాలు ఇసుక మేటలతో దర్శనమిస్తున్నాయి. కాగా ఆ పంట పొలాలు బాగుచేయాలంటే ఎకరానికి రూ.30 నుంచి రూ.50వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద సహాయం కింద రూ.10వేలు ఇచ్చిన ప్రభుత్వం ఇసుక మేటలు తొలగించు కునేందుకు ప్రభుత్వం ఎలాంటి సహా యం ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతులు ఇప్పటికే ఖర్ఫీలో ఎకరానికి రూ.20వేల పైనే ఖర్చు చేసి సాగుచేశారు. అందులోనూ పంట మొత్తం వరదపాలు కాగా ఇసుక మేటలు ఆ రైతులకు తలకు మించిన భారంగా మారాయి. ఇసుక మేటలు తొలగించి పొలాల్లో మట్టిని తరలించి మడులు కట్టాలంటే కనీసం ఎకరానికి రూ.30వేల పైనే ఖర్చవుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

రైతుల ఆశలు ఆవిరి..

పంటల సాగుకోసం పెట్టిన పెట్టుబడి తిరిగి పెద్ద మొత్తంలో అంతుందనుకున్న రైతు ఆశలు ఆవిరై పోయాయి. ఈ నష్టంతో కుంగిపోతున్న రైతులకు ప్రభుత్వ సాయం కూడా అందదన్న భయం పట్టుకుంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం అధికారులు పంట నష్టాన్ని పరిశీలించాలంటే వర్షానికి పంట కొట్టుకుపోతేనో, ఇసుక మేటలు ఉంటేనో పంట నష్టపరిహారం కింద పరిగణించవచ్చని అధికారులంటున్నారు.

పరిహా రంపై అధికారులు రైతులకు చెప్తున్న నిబంధనలు రైతన్నల ఆవేధనను రెట్టింపు చేస్తు న్నాయి. ఇక రైతులే నేరుగా నష్టం గురించి అధికారులకు ఫిర్యాదు చేస్తే, వారు చెప్పిన సమాధానాలు రైతుల ఆశలను పూర్తిగా ఆవిరి చేస్తున్నాయని రైతులంటున్నారు.  అధిక వర్షాలకు పంటచేనులో నీరు నిలిచి పంట కుళ్లిపోయినా, పంట నాణ్యత కోల్పోయినా పరిహారం అందదని అధికారులు చెబుతున్నట్లు రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వంపై ఆశలు..

రూ. లక్షల్లో నష్టాలు వచ్చి, పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను మార్చి, సహేతుక నిబంధనలతో నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లేకపోతే, అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితాలు చిక్కుల్లో పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం తమను ఆదుకుంటుందనే గంపెడు ఆశతో వారు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించింది. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది.  ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

పంటలు వేసే సమయం వచ్చే పరిహారం అందకపోయే..

భారీ వర్షాల కారణంగా ముంపుకు కారణమైన గురైన రైతులకు ఆర్థిక సహాయం అందునొ అందకపోవునో ఆ దేవుడు చేతిలోనే ఉందని పలువురు రైతులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. భారీ వరదల కారణంగా పంట పొలాల్లో ఇసుకమేటలు చెట్లు రాళ్లు కుప్పల కుప్పలుగా చేరి, రైతులకు పంట పెట్టుబడి కంటే అధిక నష్టం వాటిలిందని అయినప్పటికీ ప్రభుత్వం రైతుల పట్ల సానుభూతి చూపకపోవడం పరిహారం అందించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు. అన్నదాతకు ఈ సంవత్సరం కురిసిన వర్షానికి తీరని అవస్థ ఎదురయిందని ప్రస్తుతం మళ్లీ పంటలు వేసుకునే సమయం వచ్చినప్పటికీ పంట పొలాన్ని చదివి చేసుకోవడం అన్నదాతకు భారంగానే మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అన్నదాత...

ప్రభుత్వానికి నివేదించాం.. 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి సబ్ డివిజన్లో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, సదాశివ నగర్, గాంధారి, రామారెడ్డి,రాజంపేట, మండలాల్లో సుమారు 8,వేల ఎకరాల్లో, పంట నష్టం వాటిల్లింది. మండల వ్యవసాయ, విస్తీర్ణ అధికారులతో, క్షేత్రస్థాయి పంట పరిశీలన చేశామని నష్టపోయినా రైతుల వివరాలు, నా ఇష్టం పట్ల పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని ఎల్లారెడ్డి డివిజనల్ వ్యవసాయ అధికారి సుధా మాధురి విజయ క్రాంతి ప్రతినిధితో తెలిపారు.

 సుధా మాధురి, డివిజనల్ వ్యవసాయ అధికారి, ఎల్లారెడ్డి