calender_icon.png 22 August, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఎక్కడ దాచారు

22-08-2025 12:41:50 AM

అబద్ధాలకు తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ

గజ్వేల్, ఆగస్టు 21: రాష్ట్రంలో అవసరానికి మించి అదనంగా ఉన్న 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిందని, వెంటనే రైతుల యూరియా సమస్యను పరిష్కరించాలని బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ అన్నారు. గజ్వేల్ లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల యూరియా కొరత ఏర్పడిందని,  రాష్ట్రానికి సరిపడా యూరియా కన్నా అధికంగానే కేంద్రం సరఫరా చేసిందన్నారు. 

యూరియా ఇవ్వడం లేదని కేంద్రంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో అదనంగా నిలువ ఉన్న 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఎక్కడ దాచుకున్నారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటేనే అబద్దాలకు కేరాఫ్ అడ్రసని,  కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది తప్పులు అప్పులేనన్నారు.

కేంద్ర ప్రభుత్వం 2025 రబీ సీజన్ (అక్టోబర్ 2024  మార్చి 2025)లో తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తే అందులో 10.43 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే విక్రయాలు జరిగాయని, మిగిలిన 2.04 లక్షల టన్నులు ఖరీఫ్ సీజన్ ఓపెనింగ్ స్టాక్గా ఉందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ (ఆగస్టు 2025 వరకు)లో కావాల్సిన 8.30 లక్షల మెట్రిక్ టన్నులలో ఇప్పటివరకు 5.18 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం సరఫరా చేసిందన్నారు.

తెలంగాణాలో ఈ రోజు వరకు మొత్తం అందుబాటులో  7.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ముందుగానే స్టాక్ లేదు అని అబద్ధాలు చెప్పడం వల్లనే భయంతో రైతులు ఒక్కసారిగా యూరియా కోసం షాపుల వద్దకు చేరుకోవడం, దళారులు బ్లాక్  చేయడంతో రాష్ట్రంలో కృత్రిమ కొరత ఏర్పడిందన్నారు. ప్రపంచ సమస్యలు అనేకం పీడిస్తున్నా, ప్రజలపై దాని ప్రభావం పడకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఏ లోటు చేయకుండా సేవలు అందిస్తున్నారన్నారు. 

ప్రజల్లో మోడీ అంటే అభిమానం, గౌరవం ఎక్కువ అయ్యాయని, దీన్ని భరించలేకనే, కేవలం రాజకీయాల కోసం యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఆగం చేస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి ఎస్పీ మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్,  జిల్లా కౌన్సిల్ సభ్యులు చేప్యాల వెంకట్ రెడ్డి, పట్టణ  ప్రధాన కార్యదర్శులు మడుగురి నరసింహా ముదిరాజ్, నాయిని సందీప్ కుమార్, సీనియర్ నాయకులు నాగు ముదిరాజ్, కల్లా సాయి కుమార్, గడియారం రాజేశ్వర్ చారి తదితరులు పాల్గొన్నారు.