calender_icon.png 1 October, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి ఉగ్ర రూపం

01-10-2025 12:47:51 AM

  1. భద్రాచలం వద్ద భారీగా వరద 
  2. మంగళవారం 50 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
  3. రెండో ప్రమాద హెచ్చరిక జారీ 

భద్రాచలం సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపంలో ప్రవహిస్తున్నది. సోమవారం మొదటి హెచ్చరిక నీటిమట్టం 43 అడుగులకు చేరుకున్న గోదావరి మంగళవారం ఉదయం 5 గంటలకు రెం డో ప్రమాద హెచ్చరిక నీటిమట్టం 48 అడుగులకు చేరుకున్నది. దీంతో అధికారులు అప్రమ త్తమై రెండు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా పెరుగుతూ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు 50 అడుగులకు చేరుకున్నది.

ఇది మూడవ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు సమీప దూరం వరకు వచ్చిం ది. దీంతో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మంగళవారం గోదావరి కరకట్ట ప్రాంతం లో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. భక్తులు ఎవరు స్నానాలకి అలాగే ఫోటోషూట్ కి గోదావరి నది వైపు వచ్చి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. గోదావరి ఎగువన పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు మూలంగా గోదావరి నది నీటిమట్టం ఉధృతంగా పెరిగింది.

అయితే భద్రాచలం ఎగువనగల పేరూరు వద్ద గోదారి పెరుగుదల నెమ్మదించటంతో బుధవారం భద్రాచలం వద్ద కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అధికారులు సహాయ కార్యక్రమాలను  నిర్వహించడానికి సిబ్బందిని అప్రమత్తం చేయడమే కాకుండా లాంచీలను నాటు పడవలను సిద్ధం చేశారు. భద్రాచలం వద్ద 50 అడుగులు చేరుకోగానే భద్రాచలం నుంచి వెంకటాపురం చర్ల దుమ్ముగూడెం పర్ణశాల ప్రాంతాలకు వెళ్లే రహదారి బంద్ అయింది.

ఈ ప్రాంతాలకు వెళ్లే ప్రధాని రహదారిపై గోదావరి బ్యాక్ వాటర్ వచ్చి రోడ్డును ముంచెత్తడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే రహదారి సైతం ముంపునకు గురయింది. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు.  వీటితోపాటు గోదావరి నది కి ఇరువైపులా ఉన్న భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని వందలాది ఎకరాల్లో పంట గోదావరి నీటిలో మునిగింది.