calender_icon.png 23 November, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోగుల గ్లోబల్ టూర్

23-11-2025 12:57:19 AM

రమణ గోగుల.. తన మునివేళ్లతో గిటార్‌ను సుతారంగా తడుముతూ సుస్వరాలను సృష్టించిన స్వరకర్త. తన రాగాల ఝరిలో ఒక తరాన్ని తడిసి ముద్ద చేసిన ఆయన ఈ తరాన్ని సైతం ఉర్రూతలూగించేందుకు మళ్లీ వస్తున్నాడు. అయితే, ఈసారి తన మ్యూజిక్ జర్నీ.. నిన్నటి జ్ఞాపకాలను రేపటి ప్రపంచ వేదికపై నిలిపేలా సరికొత్తగా ఉండబోతోందంటున్నాడు. అందుకే ఇది పాటల ప్రవాహం మాత్రమే కాదు.. భావోద్వేగాల ప్రయాణం కూడా అని చెప్తున్నాడాయన. 

రమణ గోగుల భారీ సంగీత యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్ట్రేలియా సంయుక్తంగా ‘ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ ఫిబ్రవరి 2026’ పేరిట దీన్ని నిర్వహించనున్నాయి. హైదరాబాద్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వరల్డ్ టూర్ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు.

రమణ గోగులతోపాటు, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ కట్టాల, మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీశ్‌వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు టూర్ షెడ్యూల్‌ను తెలియజేశారు. 2026 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా (మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్) పర్యటనతో ఈ ప్రపంచ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. తర్వాతి దశల్లో యూకే (లండన్, మాంచెస్టర్), అమెరికా (ఈస్ట్ కోస్ట్ కోస్ట్) పర్యటనలు ఉంటాయని తెలిపారు.

రమణ గోగుల తన సంగీత ప్రస్థానంలో తొలి సారిగా పూర్తి స్థాయి గ్లోబల్ కాన్సర్ట్ టూర్‌కు శ్రీకారం చుడుతుండటం తెలుగు సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ టూర్ కేవలం సంగీత కచేరీలకే పరిమితం కాదు. రమణ గోగుల ఐకానిక్ పాటలు, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలు, తెర వెనక ఉన్న కథలతో కూడిన ఒక భావోద్వేగభరిత అన్వేషణ అని వారు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఒక వినూత్నమైన ‘డాక్యు-మ్యూజికల్ సిరీస్’ను రూపొందిస్తోంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఏళ్ల తర్వాత రమణ గోగుల మళ్లీ విశ్వ వేదికపైకి రావడం గురించి, ఆయన హిట్ సాంగ్స్ వెనుక ఉన్న వాస్తవ కథల గురించి సరదా సంభాషణలు, జామ్ సెషన్స్, సృజనాత్మక చర్చలు ఉంటా యి. ఇంకా ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో ఆయన ప్రయాణ అనుభవాలు ఇందులో తెలుసుకోవచ్చు. నేటి తరానికి ‘ట్రావె లింగ్ సోల్జర్’ సరికొత్త రీతిలో పరిచయం కావడం వంటి అంశాలూ ఉంటాయి.

ఈ డాక్యుమెంటరీని ఒక ప్రీమియం ఇండో -ఆస్ట్రేలియన్ మ్యూజికల్ జర్నీగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ మ్యూజికల్ జర్నీ ప్రవాస భారతీయులను కళ, కథల ద్వారా ఏకం చేయడమే లక్ష్యంగా సాగనుందని వారు చెప్పారు.