calender_icon.png 15 November, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారుకొండ!

01-12-2024 02:13:43 AM

ఏఈఈ నిఖేశ్‌కుమార్ అక్రమాస్తులు 170 కోట్లు 

  1. ఏకకాలంలో 2౦ చోట్ల ఏసీబీ సోదాలు 
  2. బంధువులు, స్నేహితుల ఇళ్లపైనా దాడులు
  3. కిలోల కొద్దీ బంగారం.. విలువైన ఆభరణాలు 
  4. ఫామ్‌హౌస్‌లు, ఇళ్ల, ప్లాట్ల పత్రాలు గుర్తింపు
  5. నిందితుడిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు 
  6. గత మేలో లంచం తీసుకుంటూ చిక్కిన ఏఈఈ 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి)/రాజేంద్రనగర్: గత మేలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఈ నిఖేశ్ కుమార్‌కు దాదాపు రూ.17౦ కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు ఏకకాలంలో 2౦ చోట్ల జరిపిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు, బంగారం, ఆభరణాలు, ప్లాట్లు, ఫామ్‌హౌస్‌లు ఉన్నట్టు తెలిసింది.

మూడు విలువైన ఫామ్‌హౌస్‌లు, విల్లాలు, 5 ఇళ్ల స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ప్లాట్స్, రెండుచోట్ల వాణిజ్య స్థలాలకు చెందిన ఆస్తి పత్రాలతోపాటు కిలోల కొద్దీ బంగారం, బంగారు ఆభరణాలు, బ్యాంక్ లాకర్లను గుర్తించినట్టు ఏసీబీ అధికారులు ధ్రువీకరించారు. వీటి విలువ సుమారు రూ.17,73,53,500 ఉన్నట్టు ఏసీబీ వెల్లడించింది.

మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ దాదాపు రూ.170 కోట్లకు పైగానే ఉటుందని అంచనా. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో నాలుగేళ్ల పాటు ఏఈఈగా పనిచేసిన నిఖేశ్‌కుమార్.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాల అనుమతులకు నిబంధనలకు విరుద్ధంగా ఎన్వోసీలు జారీచేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి అక్రమంగా సంపాదించినట్టుగా తెలుస్తోంది. 

11 ఏండ్లు.. 17౦ కోట్లు

2013లో నిఖేశ్‌కుమార్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)గా చేరారు. కేవలం ౧౧ ఏండ్లలోనే ఈయన దాదాపు రూ.170 కోట్లు అక్రమాస్తులు కూడబెట్టిన ట్టు ఏసీబీ సోదాల్లో వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాల అనుమతులకు సంబంధించిన ఎన్వోసీ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి ఈ ఏడాది మే 30న రూ.2.50 లక్షల లంచం డిమాండ్ చేశాడు.

రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ కార్యాలయంలో లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈయనతోపాటు ఈఈ బన్సీలాల్, మరో ఏఈఈ కార్తీక్ ఉన్నారు. ఈ కేసులో జైలుకెళ్లిన నిఖేశ్‌కుమార్ సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఇదిలా ఉండగా, ఈ కేసు పురోగతిలో భాగంగా ఏసీబీ అధికారులు జరుపుతున్న దర్యాప్తులో నిఖేశ్‌కుమార్ ఆదాయానికి మించి భారీగా అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించడంతో శనివారం గండిపేట పెబెల్ గేటెడ్ కమ్యూని టీలోని నివాసంతోపాటు స్వగ్రా మం తాం డూరు, పరిగి, వరంగల్ జిల్లా పరిధిలోని బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో అడిషనల్ ఎస్పీ శివరాం, డీఎస్‌పీ శ్రీధర్ పర్యవేక్షణలో ఏక కాలంలో 20 చోట్ల 20 బృందాలు తనిఖీలు చేపట్టారు. తనిఖీల అనంతరం శనివారం రాత్రి నిఖేశ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు.