27-09-2025 12:00:00 AM
భారత వైమానిక దళంలో కొన్ని దశాబ్దాలుగా వెన్నుముకలా నిలిచి ఎన్నో యుద్ధాల్లో విజయాలు అందించింది మిగ్-21 ఫైటర్ జెట్. రష్యా నుంచి తీసుకొచ్చిన ఈ యుద్ధ విమానాలు ఒకప్పుడు భారత్ విజయానికి బాటలు పరిచాయి. అదే సమయంలో ఇదే మిగ్ (మికోయాన్ గురెవిచ్) యుద్ధ విమానాలు పిట్టల్లా నేలకూలి, ఎందరో పైలట్ల ప్రాణాలు తీసి ‘ఎగిరే శవపేటికలు’గానూ అపకీర్తిని మూటగట్టుకున్నాయి.
తేలికపాటి ‘తేజస్’ యుద్ధ విమానాలు రాకతో వీటి అవసరం లేదని గుర్తించిన కేంద్రం మిగ్-21కు వీడ్కోలు పలకాలని భావించింది. దాదాపు 60 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన మిగ్-21 విమానాలకు శుక్రవారం చండీగఢ్ వాయుసేన కేంద్రం వేదికగా శాశ్వతంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్, ఐఏఎఫ్ సీనియర్, మాజీ అధికారులు పాల్గొన్నారు.
భారత్ పాల్గొన్న చాలా యుద్ధాల్లో మిగ్-21 యుద్ధ విమానం కీలక పాత్ర పోషించిందని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. మిగ్ ఫైటర్ జెట్.. భారత్, రష్యా సంబంధాలకు ఒక సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మిగ్-21 భా రత్ తొలి సూపర్‌సోనిక్ యుద్ధ విమానం. దీనిని 1960ల్లో రష్యా నుంచి భారత్ తీసుకువచ్చింది. 1963లో మిగ్-21 విమానాన్ని భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. ఈ విమానాన్ని 1960 నుంచి 60 సంవత్సరాల్లో సాంకేతికంగా ఎన్నోసార్లు అభివృద్ధి చేశారు.
శక్తిమంతమైన ‘తుమన్ స్కై ఆర్-25’ టర్బోజెట్ ఇంజిన్ సాయంతో ధ్వని వేగానికి రెండు రెట్ల పైబడిన వేగం అందుకోవడం మిగ్-21కు ఉన్న ప్రత్యేకత. 1965 ఇండో--పాక్ యుద్ధం, 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 20 19లో బాలాకోట్ వైమానిక దాడుల్లో మిగ్-21 యుద్ధ విమానాలు కీలకపాత్ర పోషించాయి. బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఈ యుద్ధ విమానంతోనే పాక్‌కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చేసిందని సమాచారం.
ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలోనూ మిగ్-21 సేవలు అందించాయి. మొ త్తంగా భారత వాయుసేనను ఆధునీకరించిన మిగ్ యుద్ధ విమానాలు శ త్రువులను భయపెట్టడంలో విజయవంతమయ్యాయి. భారత వైమానిక దళానికి ఎన్ని సేవలందించినా, ఎన్ని విజయాలు సాధించిపెట్టినా, దేశ భౌగోళిక ప్రాంతాన్ని పరిరక్షించి నప్పటికీ మిగ్-21లకు ‘ఎగిరే శవపేటిక’ అనే చెడ్డ పేరు మాత్రం తప్పలేదు.
మన దేశంలో గత 60 ఏళ్లలో 400కు పైగా మిగ్-21 యుద్ధ విమానాలు కూలిపోవడం గమనార్హం. 200 మం దికి పైగా ఐఏఎఫ్ పైలట్లు, 60 మందికి పైగా పౌరులు ఆయా దుర్ఘటనల్లో మరణించారు. కాగా మిగ్ విమానాలకు వీడ్కోలు పలకడం వెనుక బలమైన కారణం ఉంది. ఈ ఫైటర్ జెట్స్‌లో ఉపయోగిస్తున్న సాంకేతికత చాలా పాతది. హై ల్యాండింగ్ స్పీడ్‌తో పాటు ఇంజిన్ సర్జ్ సమస్యలు అధికంగా ఉన్నాయి.
షార్ట్ రన్‌వేలలో మిగ్ విమానాలు చాలాసార్లు కుప్ప కూలాయి. అత్యంత వేగంగా దూసుకెళ్లే ఈ మిగ్ విమానాలను కంట్రోల్ చేయడం పైలట్లకు కూడా కష్టతరంగా ఉండేది. అయితే ఎన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ భారత్‌కు రక్షణ పరంగానూ, ప్రత్యర్థులపై దాడుల పరంగా నూ మన వైమానిక దళానికి గగనతలంలో విశిష్ట సేవలందించిన మిగ్-21 విమానాలకు సలాం చెప్పాల్సిందే.