23-10-2025 12:00:00 AM
హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఘనంగా నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆధ్యాత్మిక ఉత్సా హం, భజనలు, కీర్తనలు, దీపాల వెలుగులతో వైభవంగా అలంకరించబడ్డాయి. ఆలయంలో ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన అద్భుతమైన గోవర్ధన పర్వత ప్రతిరూపం భక్తులను ఆకట్టుకుంది.
స్వామివారికి 56 రకాల ఫలహారాలు- మిఠాయిలు, వంటకాలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలతో కూడిన అన్నకూట సమర్పణను భక్తిపూర్వకంగా నివేదించారు. ఉదయం కార్యక్రమాలు ఆలయ గోశాలలో గోపూజతో ప్రారంభమయ్యాయి. ఆవులు, దూడలకు శ్రీకృష్ణ ప్రసాదాన్ని సమర్పించారు. మధ్యాహ్నం గోవర్ధన పర్వత ప్రతిరూపం ఆవిష్కరణ జరిగింది. ఆ తర్వాత అన్నకూట మహోత్సవంలో భాగంగా అనేక రకాల నైవేద్యాలు సమర్పించి, అనంతరం భక్తులు గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
సాయంత్రం ఆలయంలో భక్తి కీర్తనలు, పల్లకి ఉత్సవం, ఆలయ ఆరతులు మహోత్సంగా జరిగాయి. హరేకృష్ణ మూమెంట్, హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస ప్రభూజీ గోవర్ధన లీలల ఆధ్యాత్మిక ప్రాధాన్యం గురించి ప్రసంగించారు. ఇంద్రుడి ఆగ్రహం నుంచి బృందావన వాసులను రక్షించేందుకు దేవాధిదేవుడైన కృష్ణ పరమాత్ముడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సంఘటన, భక్తుల పట్ల భగవంతుడికి ఉన్న అపారమైన కరుణకు ప్రతీక అని ప్రభూజీ ప్రవచించారు.
కార్తీక దీపోత్సవంలో భాగంగా భక్తులు కార్తీక దీపాన్ని వెలిగించి, యశోదా దామోదరునికి దామోదర ఆరతిని సమర్పించారు. “దామోదరాష్టకం” శ్లోకాలతో ఆలయ వాతావరణం భక్తి రసమయంగా రూపుదిద్దుకుంది. ప్రతి భక్తుడికి నెయ్యితో దీపారాధన చేసే అవకాశాన్ని కల్పించారు. అనంతరం భగవాన్ శ్రీకృష్ణుడి గోవర్ధన లీలల ఆధారంగా ఏర్పాటు చేసిన వీడియో ప్రదర్శన భక్తులందరినీ ఆకట్టుకుంది. చివరగా అందరికీ రుచికరమైన అన్నకూట ప్రసాదం వడ్డించబడింది.