16-08-2024 12:25:09 AM
పదేండ్లలో చేయలేని పనిని 8 నెలల్లో చేశాం
ఉమ్మడి ఖమ్మంలోని ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చి సత్వరమే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గత పాలకులు ప్రాజెక్టుల అంచనాలు పెంచి నిధులు బుక్కితే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికాబద్దంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయ కట్టు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతున్నదని చెప్పారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజ కవర్గం పరిధిలోని ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం రెండో పంపుహౌస్‌ను సీఎం ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలపాటు అధికారంలో ఉండి చేయలేని పనిని తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో ఆచరణలో చేసి చూపామని అన్నారు. రూ.1500 కోట్లతో పూర్తిచేయాల్సిన ఆనాటి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టు వ్యయాన్ని రీడిజైన్ పేరుతో రూ.18,400 కోట్లకు పెంచి, రూ 8,400 కోట్లు ఖర్చుచేసి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. కమీషన్ల భాగోతం ఎక్కడ బయ టపడుతుందోనని 10 సంవత్సరాలపాటు సీడబ్ల్యూసీకి డీపీఆర్ కూడా సమర్పించలేదని ఆరోపించారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా నిధుల కేటాయింపులో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
కేసీఆర్ పదేండ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వకున్నా ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్, హారీష్‌రావు బోగస్ మాటలు చెబుతారు కాబట్టే ఆ పార్టీ నేతలు నీళ్ల కోసం ఆందోళన చేయలేదని ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టు కోసం వైరా లింక్ కెనాల్ చేపట్టామని వెల్లడించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై నమ్మకంతో నష్ట పరిహారం ఇవ్వకపోయినా లింక్ కెనాల్ కోసం రైతులు భూములు ఇచ్చారని కొనియాడారు.
మోటర్లను సద్వినియోగం చేశాం: తుమ్మల నాగేశ్వర్‌రావు
గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుపై రూ.8 వేల కోట్లు ఖర్చు చేసి తలా తోక లేకుండా పనిచేసి వదిలేస్తే తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేలా ప్రణాళిక తయారు చేసి నాలుగేళ్ల క్రితం బిగించిన మోటర్ల పాడు కాకుండా వినియోగంలోకి తెచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. యాతాలకుంట టన్నెల్ పూర్తిచేస్తే సత్తుపల్లి ట్రంక్ పరిధిలో ఆయకట్టుకు గోదావరి జలాలు చేరుతాయని చెప్పారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేస్తే పాలేరుకు గోదావరి జలాలు వస్తాయని అన్నారు. తక్కువ ఖర్చుతో 70 రోజుల్లో వైరా లింక్ కెనాల్ పూర్తి చేశామని వివరించారు. తాము నెత్తిన నీళ్లు చల్లుకోవడానికి రాలేదని, ప్రభుత్వం అంటే నిరంతర అభివృద్ధి ప్రక్రియ అని అన్నారు. చిల్లర మాటలతో చేసే రాజకీయాలకు విలువ లేదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు కేసీఆర్, హారీష్‌రావు నిధులు ఎందుకు కేటాయించ లేకపోయారని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం 39 శాతమే పనులు చేసింది: పొంగులేటి
గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా బేసిన్‌కు నీళ్లు తరలించే ప్రాజెక్టు కాంగ్రెస్ పేటెంట్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వమే 90 శాతం పనులు పూర్తి చేసిందని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని, వారి డీపీఆర్ పరిశీలిస్తే రూ.18,400 కోట్లకు ఆ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ. 7,400 కోట్లు మాత్రమేనని తెలిపారు. అంటే 39 శాతం పనులు మాత్రమే చేశారని విమర్శించారు.
ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీశ్‌రావు రాజీనామా పత్రం సిద్ధ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు, రాఘమయి, కోరం కనకయ్య, మువ్వా విజయ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు మంత్రులు మూడు పంపుహౌస్‌లు
సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు చెందిన ౩ పంపుహౌస్‌లను ముగ్గురు మం త్రులు ప్రారంభించారు. పినపాక నియోజకవర్గం, అశ్వాపురం పరిధిలోని బీజీ కొత్తూరు వద్ద 1వ నంబర్ పంపుహౌస్‌ను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని పూసుగూడెం వద్ద 2వ నంబర్ పంపుహౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అదే మండలంలోని కమలాపురం వద్ద గల 3వ పంపుహౌస్‌ను ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించి మోటర్లను ఆన్ చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టులు పడావు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ చేసి అంచనాలు పెంచి, మోటర్లు బిగించిందని సీఎం విమర్శించారు. మోటర్లు బిగించి నాలుగేళ్లయినా కనీసం విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని ఆరోపించారు. ఆరు నెలలు రేయింబవళ్లు కష్టపడి పంపుహౌస్ నీరు పారేలా చేశామని, పడావు పడిన ప్రాజెక్టును పనికి వచ్చేలా చేస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేసి, నాగార్జునసాగర్ నుంచి నీళ్లు రాకున్నా గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లాలోని పొలాలు తడపవచ్చని వివరించారు. పొరుగున ఉన్న నల్లగొండ జిల్లాతో నీటి పంచాయితీ లేకుండా గోదావరి నీళ్లతో ఖమ్మం ఆయకట్టుకు నీరు అందిస్తున్నామని తెలిపారు. తమ పనిని హరీష్‌రావు అభినందించకపోయినా ఫర్వాలేదు కానీ అవమానించేలా మాట్లాడొద్దని సూచించారు. ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేసి తీరుతామని హామీ ఇచ్చారు.