01-07-2025 07:06:40 PM
సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి...
డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్యులకు ఘన సన్మానం..
మణుగూరు (విజయక్రాంతి): సమాజంలో వైద్యులు ఎందరో ఉన్నా, వారిలో సేవాభావం కలిగిన వైద్యులు కొందరే ఉంటారని, సమర్ధత, సేవా భావంతో కంటికి కనిపించే దేవుళ్ళుగా మన డాక్టర్లు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలకు 24 గంటల పాటు వైద్య సేవలను అందించడం ఏజెన్సీ ప్రాంత ప్రజల అదృష్టమని ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి(Lawyer Karne Ravi) అన్నారు. డాక్టర్స్ డే(National Doctors Day) సందర్భంగా మంగళవారం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రి సూపరిండెంట్ సునీల్ మంజేకర్, ఆర్ఏంఓ లు డాక్టర్. మార్తి సాయి మోహన్, డాక్టర్. ఎం. గౌరీ ప్రసాద్, వైద్యులు శ్రీదేవి, ప్రేమ్ రెడ్డి, పద్మ, పావని, ప్రసాద్, నిఖిల్, కృష్ణ శ్రీ, స్వాతిలను ఆయన ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రవి మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో ప్రజల జబ్బులను నయం చేసే వైద్యులు దేవుడితో సమానమన్నారు.
తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని, పశ్చిమబెంబాల్ తొలి ముఖ్యమంత్రి డాక్టర్ బిపిన్ చంద్రరాయ్ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటామన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యాన్ని అత్యవసర సేవలను అందిస్తున్న వైద్యుల సేవలను ప్రజలు మరచిపోరని ప్రశంసించారు. డబ్బుల కంటే సేవే ముఖ్యమనుకునే డాక్టర్లకు సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు. వైద్య వృత్తిని సేవా దృక్పథంతో చేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఒక్క వైద్యులకే ఉందన్నారు. అలాంటి వైద్యులకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు వలసాల వెంకట రామారావు, సాయిరాం హాస్పిటల్ నరేందర్, సిద్దెల తిరుమల రావు, వెంకట్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.