26-07-2025 12:00:00 AM
కౌడిపల్లిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ
కౌడిపల్లి(మెదక్), జూలై 25(విజయక్రాంతి): సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల వంటి పథకాలు పేదల ఆత్మగౌరవం పెంచే కార్యక్రమాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. కౌడిపల్లి మండలం రైతు వేదికలో శుక్రవారం ఆహార భద్రత కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు 2508 కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా, వీటితోపాటు 10,500 మంది సభ్యులను రేషన్ కార్డులలో చేర్చడం జరిగిందన్నారు. జిల్లాలో 87,491 మంది రైతుల ఖాతాల్లో రూ.645 కోట్లు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 28,790 మంది రైతులకు సంబంధించి రూ.211 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు.
ఈనెల 25 నుండి 10వ తారీకు వరకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం శుభపరిణామన్నారు. వడ్డీ లేని రుణాలు. నర్సాపూర్ నియోజకవర్గంలో మహిళలందరికీ అందించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ ,తహసిల్దార్ శ్రీనివాస్, సంబంధిత ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.