calender_icon.png 27 August, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్దె భవనాల్లో ప్రభుత్వ బడులు

12-12-2024 01:09:52 AM

  1. బకాయిలు దాదాపు రూ.4కోట్లు
  2. 18 నెలలుగా విడుదల కాని వైనం
  3. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇక్కట్లు 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): చారిత్రకంగా ఒకవైపు, వేగంగా అభివృద్ధి చెందుతూ మరోవైపు హైదరాబాద్ నగరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం సొంత భవనాల్లేని దుస్థితి నెలకొంది. నగరంలోని పలు పాఠశాలలు ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

పాఠశాలల భవనాల నిర్మా ణానికి స్థలాలు లేక కొన్ని, ఉన్న స్థలాల్లో భవనాలు నిర్మించలేక మరి కొన్ని పాఠశాలలు కిరాయి భవనాల్లోనే గడుపుతున్న పరిస్థితి ఉంది. సకాలంలో ప్రభుత్వం నుంచి భవనాల యజమానులకు  అద్దె బకాయిలు విడుదల కాకపోవడంతో 18 నెలలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

నగరంలో అద్దె భవనాల్లో నడుస్తున్న 100కు పైగా పాఠశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు దాదాపు రూ.4 కోట్ల వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల భవనాలకు సంబంధించిన అద్దె బకాయిల కోసం ప్రభుత్వానికి జిల్లా విద్యా శాఖ నుంచి నివేదికలు అందినప్పటికీ స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి.

వసతులు లేక.. అభివృద్ధికి నోచుకోక

అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక, అభివృద్ధికి నోచుకోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శపాఠశాల పనులు ఈ పాఠశాలల్లో జరగకపోవడం గమనార్హం. జిల్లాలో 394 పాఠశాలల్లో దాదాపు రూ.30 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు జరిగాయి.

దీంతో ఆయా పాఠశాలల రూపురేఖలు కొంతమేర మారాయి. విద్యార్థులకు కనీస వసతులు కల్పించారు. కాగా మిగతా పాఠశాలలు అద్దె భవనాలు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భవనాల్లో నడుస్తున్నాయి. దీంతో ఈ పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరగలేదన్న ఆరోపణలున్నాయి.

ఒప్పందం ప్రకారం అద్దె భవనాల యజమానులు ఆయా పాఠశాలల్లో వసతులు కల్పించాలి. కానీ 18 నెలలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వారు స్పం దించడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో చేసేదేమీ లేక అరకొర వసతుల మధ్యే విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు.

ఈ మండలాల్లో ఎక్కువ 

జిల్లాలో మొత్తం 691 పాఠశాలలుండగా వాటిలో 461 పాఠశాలలకే సొంతభవనాలున్నాయి. 100కు పైగా పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో 90కి పైగా ప్రాథ మిక, ప్రాథమికోన్నత పాఠశాలలుండగా, మరో 10కి పైగా ఉన్నత పాఠశాల లున్నాయి. మరో 70కిపైగా ప్రభుత్వ పాఠశాలలు కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రభుత్వ అనుబంధ శాఖల భవనాల్లో నడుస్తున్నాయి.

హైదరాబాద్ జిల్లాలోని అంబర్‌పేట మం డలంలో 4, ఆసిఫ్‌నగర్‌లో 14, బహదూర్‌పురలో 43, బండ్లగూడలో 25, చార్మినార్‌లో 18, గోల్కొండలో 3, ఖైరతాబాద్‌లో 2, నాంపల్లిలో ఒకటి, సైదాబాద్‌లో 3 పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.  ఈ పాఠశా లల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా భవనాల విస్తీర్ణాన్ని బట్టి ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. కనిష్ఠంగా దాదాపు రూ.2 వేల నుంచి, గరిష్ఠంగా రూ.1.5లక్షల వరకు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు.