12-12-2024 12:12:33 AM
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటివరకు ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. 420 హామీలు. మేం పదేళ్లు తెలంగాణను పాలించాం. మేం పేర్లు మార్చే పనిపెట్టుకోలేదు.
పేదల బతుకులు మార్చాం. మేం తలుచుకుంటే రాజీవ్‌గాంధీ పేర్లు, ఇందిరమ్మ విగ్రహాలు ఉండేవా? కాంగ్రెస్ పాలన తెలంగాణ అస్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తోంది. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రం గం వరకు అన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయి. మీ సమక్షంలోనూ కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది.
ఇప్పుడు మీరు కూడా పత్తా లేరు. మీ పార్టీకి తెలంగాణపై రవ్వంత బాధ్యత లేదు’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి బహిరంగ బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పూఠం ఇలా..
బతుకు ఛిద్రమవుతున్నది..
సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. దేశానికే వెన్నెముక అయిన రైతన్నకు వెన్నుపోటు పొడిచిన పా లన మీది. రైతు రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమైతే తూతూమంత్రంగా మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. అది కూడా నాలుగు విడతలుగా ఊరించి ఉసూరుమనిపించారు. అనేక సమస్యలతో ఏడాదిలో 620 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
అయినప్పటికీ ముఖ్యమంత్రిలో చలనం లేదు. బీఆర్‌ఎస్ హయాంలో అప్రతిహతంగా అప్రతిహతంగా పెట్టుబడి సాయం కొనసాగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బ్రేకులు పడ్డాయి. పెట్టుబడి సాయాన్ని మొత్తానికే ఎగ్గొట్టి రైతాంగాన్ని నిలువునా ముంచారు. ఎన్నికల ప్రచారంలో అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మబలికి, తీరా గద్దెనెక్కాక సన్న వడ్లకు మాత్రమేనని సరిపెట్టింది.
గంగలో కలిసిన హామీలు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఏడాది పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు 12,527 మాత్రమే. యువతకు మీరు మరో 1,87,473 ఉద్యోగాలు బాకీ ఉన్నారు. యువతకు ఇస్తామన్న రూ.10 లక్షల వడ్డీ లేని రుణాల సంగతమైంది? మీరు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
హామీలు నెరవేర్చలేని మోసంలో మీరు కూడా భాగస్వాములయ్యారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీ నీటమూటగానే మిగిలింది. ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని బీరాలు పలికారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్లు 4 వేలకు పెంచుతామని, దివ్యాంగులకు ఏకంగా రూ.6 వేలు ఇస్తామన్నారు. ఆ హామీలన్నీ గంగ పాలయ్యాయి.
హైడ్రా పేరిట హంగామా..
‘రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట హంగామా సృష్టించింది. మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నర కోట్ల లూటీకి రంగం సిద్ధమైంది. నాడు ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న మా తెలంగాణ ఇప్పుడు ప్రజలపాలిట జనతా గ్యారేజీగా మారింది. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మా వద్దకే వస్తున్నారు.
అల్లుడి ఫార్మా కోసం..
అల్లుడి కోసం ఫార్మా కంపెనీ, అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో రైతుల భూములను బలంవంతంగా లాక్కునే కుట్ర చేశారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డలు ఢిల్లీ వేదికగా ఈ విషయాన్ని ఎండగట్టారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ఫార్మా విలేజీ ప్లాన్ బెడిసికొట్టిందనే కక్షతో ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట మీ ప్రభుత్వం మరో కుతంత్రానికి తెరపైకి తెచ్చింది.
తెలంగాణ తల్లి స్వరూపాన్ని అవమానించి..
ఉద్యమంలో కోట్లాది మందిలో స్ఫూర్తినింపిన తెలంగాణ తల్లి దివ్య స్వరూపాన్ని అవమానించి, ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం హేయం. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మేం తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టాం తప్ప.. పేర్లు మార్చే పనిపెట్టుకోలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేర్లు మార్చలేదు. ఇందిరాగాంధీ విగ్రహాల జోలికి వెళ్లలేదు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను చెరిపేసే దారుణ కుట్రకు తెరలేపారు.
కవి సిధారెడ్డి సాహసోపేత నిర్ణయం
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి, ఆమె చేతిలో బతుకమ్మను తొలగించినందుకు నిరసనగా కవి నందిని సిధారెడ్డి సన్మానోత్సవాన్ని తిరస్కరించడం సాహసోపేతమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. బుధవారం ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సిధారెడ్డి నిర్ణయం ప్రతి తెలంగాణవాసికి గర్వకారణమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఆయన నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.