24-09-2025 11:31:17 PM
సూర్యాపేట,(విజయక్రాంతి): సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన ఎంపరికల్ డేటా లేకుండా కులాల వారీగా చేసిన ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక రిధికా గ్రాండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా మాలమహానాడు అధ్యక్షులుగా పెన్ పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన బొల్లెద్దు వినయ్ కి నియామకపత్రం అందజేసి మాట్లాడారు. జనాభా లెక్కలు చేయకుండానే మాలలకు 5శాతం, మాదిగలకు 9శాతం రిజర్వేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్లు పెట్టడంతో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
రోస్టర్ పాయింట్లను సవరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఇటీవల ఆర్టీసీ ఉద్యోగాల్లో మాలలకు 28 పోస్టులుంటే మాదిగలకు 100 పోస్టులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపును పునర్ సమీక్షించి జీఓ 99ని సవరించి మాలలతో పాటు గ్రూప్ 3లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలన్నారు. నవంబర్ 2న హైద్రాబాద్లో నిర్వహించే మాలల రణభేరి మహాసభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాలల రణభేరి కరపత్రాలను ఆవిష్కరించి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం అయిన పంగరెక్క సంజయ్ కి నియామక పత్రం అందజేశారు.