25-09-2025 12:10:30 AM
నిజామాబాద్, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లా తో పాటు నగరంలో కూడా భారీ ఎత్తున వర్షపు నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. రెండు మూడు రోజులుగా సాయంకాలం పూట కురుస్తున్న వర్షాలతో జనజీవం స్తంభించిపోతోంది. నగరం లోని ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు రోడ్లపై రావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.
నిజామాబాద్ కోర్టు చౌరస్తా వినాయక్ నగర్ వర్ని రోడ్డు కలెక్టరేట్ అర్సపల్లి పవిత్ర ప్రాంతాల్లో వర్షపు నేను నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఇలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో ఇవాళ కురిసిన భారీ వర్షాలకు వాటికి తోడు వరద నీటి ధాటికి పంట పొలాలు ఇసుక చెత్తాచెదారంతో పశువుల కళేబరాలతో నిండిపోగా రోడ్లు కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా ఎగువ నుండి వరద నీరు రావడంతో నవీపేట్ మండలంలోని గ్రామాల్లో పంట పొలాల్లో వరద నీరు చేరుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి భారీగా 5 40 ప్రధాన గేట్లను అధికారులు ఎత్తివేశారు .
ప్రాజెక్టు సామర్థ్యం పూర్తిస్థాయి 1091 అడుగులు కాగా 1086 అడుగులు,నీటి నిల్వ సామర్ధ్యం80.5 టిఎంసీలు కాగా 63.937 టీఎంసీలుగా అధికారులు నమోదు చేశారు. ఎగువ మహారాష్ట్ర నుండి చుట్టుపక్కల జిల్లా నుండి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుండడంతో నీటిమట్టం పెరిగిపోయింది. శ్రీ రాగం సాగర్ ప్రాజెక్టులోకి 2లక్షల 15 వేల894 క్యూసెక్కుల మీరు ఎగువ నుండి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం కంటే ఎక్కువ వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుండడంతో 3,35,150 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.
ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 8735 క్యూసెక్కుల నీళ్లు వదలడంతోపాటు కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సరస్వతి కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు లక్ష్మీ కాల్వ ద్వారా 200 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 2500, క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జిల్లాలో ముంపునకు గురైన గ్రామాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సందర్శించారు.
వరద నీటి ఉద్ధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో ధర్పల్లి మండలం వాడి గ్రామంతో పాటు నడిమి తండా, బీరప్ప తండాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీ.పీతో కలిసి వాడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.
నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు, కూలిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉద్ధృతి తీవ్రతను అంచనా వేశారు. ఇళ్లలోకి వచ్చి చేరిన వరద జలాలతో వాటిల్లిన నష్టం గురించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన ఒన్నాజిపేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ముంపు బాధితులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు.
ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే, కలెక్టర్ భరోసా కల్పించారు. వారం రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, రక్షిత మంచి నీరు అందుబాటులో ఉంచామని అన్నారు. కాగా, విద్యుత్, తాగునీటి వసతి వంటి సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున మళ్లీ వరద వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కొనేలా, ప్రజలకు సహాయక చర్యలు అందించేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని ఎస్.డీ.ఆర్.ఎఫ్. బృందాలకు, పోలీసులకు సూచించారు.
ఆరెంజ్ అలర్ట్ లో నిజామాబాద్ జిల్లా కూడా ఉండడంతో అధికారుల అప్రమత్తమయ్యారు. వాడి గ్రామాన్ని సందర్శించడానికి ముందు, రామడుగు, లోలం గ్రామాల వద్ద లో లెవెల్ వంతెన పై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని కలెక్టర్, సీపీ లు పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఈ మార్గాల మీదుగా రాకపోకలను నిలిపి వేయించారు.