20-09-2025 06:41:59 PM
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్..
వనపర్తి (విజయక్రాంతి): గత సీజన్లలో సీఎంఆర్ పూర్తి చేసి ఉండి, ఇపుడు బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన మిల్లర్లకే 2025-26 ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్(Additional Collector Revenue Kheemya Naik) అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 430 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సారి 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పీపీసీ లకు వస్తుందని అంచనా ఉన్నట్లు చెప్పారు. ఈ సీజన్లో మిల్లర్లకు ఇబ్బంది లేకుండా క్లీనర్ లు ఏర్పాటు చేయించి ధాన్యం క్లీన్ గా, నిర్దేశించిన తేమ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
గత సీజన్లలో సీఎంఆర్ పూర్తి చేసి ఉండి, ఇపుడు బ్యాంకు గారంటీలు సమర్పించిన మిల్లర్లకే 2025-26 ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం కేటాయించడం జరుగుతుందని చెప్పారు. డీఫాల్టర్ లకు పెండింగ్ పూర్తి చేస్తేనే కొత్తగా ధాన్యం కేటాయించడం జరుగుతుంది అన్నారు. ఇక గత ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పెండింగ్ సీఎంఆర్ ఇవ్వాల్సిన మిల్లర్లు నవంబర్ 12 తేదీ లోపు సమర్పించాలని ఆదేశించారు. మిల్లర్లు వారికి కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మాత్రమే ధాన్యాన్ని దింపుకోవాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాధ్, పౌర సరఫరాల సంస్థ డి ఎం జగన్మోహన్, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.