15-05-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,మే14(విజయ క్రాంతి): రైతు సంక్షేమంలో భాగంగా ప్రభు త్వ ఆదేశాల ప్రకారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం పెంచికల్ పేట మండలం ఎల్కపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు కేంద్రాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తేమశాతం తక్కువ ఉన్న ధాన్యా న్ని త్వరగా తూకం వేసి కేటాయించిన ప్రకా రం రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. రైస్ మిల్లర్లు తమకు వచ్చిన ధాన్యాన్ని త్వర గా దిగుమతి చేసుకొని వాహనాలను తిరిగి పంపించాలని తెలిపారు.
రైతులు ధాన్యంలో తాలు, దుమ్ము లేకుండా నిబంధనల ప్రకా రం నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని తెలిపారు. తూకంలో తరుగు కింద ధాన్యం లో కోత చేయవద్దని, అకాల వర్షాలు, ఎండ తీవ్రత దృష్ట్యా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని, అవసరమైన గోనె సం చులను సమకూర్చాలని తెలిపారు.
ధాన్యం విక్రయించేందుకు కొనుగోళ్లు కేంద్రాలకు వచ్చే రైతులకు త్రాగునీరు, నీడ, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కొనుగోళ్లు కేంద్రాలలో ధాన్యం తూకం వేయడంలో నిర్వాహకులు జాప్యం చేయకూడదని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్ రావు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.