23-12-2025 12:00:00 AM
- వార్త ప్రచురించిన విజయక్రాంతి
- చర్యలు చేపట్టిన అధికారులు
నంగునూరు, డిసెంబర్ 22: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెలకొన్న సమస్యపై విజయక్రాంతి వార్త ప్రచురించింది. జిల్లా కలెక్టర్ హైమావతి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు లారీ ఏర్పాటు చేసి దుబ్బాక లోని పరమశివ మిల్లుకు పంపించారు.
నెల రోజులుగా కేంద్రంలోనే ధాన్యం నిల్వలతో అల్లాడుతున్న రైతుల గోసపై ‘వరి రైతుల కన్నీటి పోరు‘ అంటూ వెలువడిన కథనంతో కొద్ది గంటల్లోనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, మిల్లర్లతో చర్చలు జరిపారు. తక్షణమే ధాన్యం తరలింపునకు ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన ధాన్యాన్ని నాలుగు రోజుల్లో తరలించి, కొనుగోలు ప్రక్రియను త్వరగా ముగిస్తామని ఏపిఏం శ్రీనివాస్ తెలిపారు. తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేసిన విజయక్రాంతి దినపత్రికకు, గట్లమల్యాల రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.