calender_icon.png 23 December, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్యాపింగ్.. బిగ్ బాస్ ఎవరు?

23-12-2025 12:00:00 AM

  1. ప్రభాకర్‌రావు నియామకం వెనుక ఉన్నదెవరు?
  2. రిటైరయ్యాక ఓఎస్డీ పోస్టు ఎందుకిచ్చారు? 
  3. నిబంధనలు పాటించారా?
  4. మాజీ సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ బాస్‌పై సిట్ ప్రశ్నల వర్షం
  5. సోమేష్ కుమార్, శాంతికుమారి, నవీన్ చంద్ల వాంగ్మూలాల రికార్డ్
  6. త్వరలో సప్లిమెంటరీ చార్జిషీట్

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ట్యాపింగ్ వ్యవహారం జరిగిన సమయంలో అత్యంత కీలక బాధ్యతల్లో ఉన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శు లు, ఇంటెలిజెన్స్ చీఫ్‌లను సిట్ అధికారులు మరోసారి పిలిపించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. వీరి నుంచి సేకరించిన సమాచారంతో ఈ కేసులో బిగ్‌బాస్ ఎవరనేది తేల్చే పనిలో సిట్ నిమగ్నమైంది.

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి, నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన ఉన్నతాధికారులు.. ట్యాపింగ్ వ్యవహారంలో ఎలా వ్యవహరించారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎస్‌ఐబీ చీఫ్‌గా టి ప్రభాకర్ రావు ఉన్న సమయంలో, ట్యాపింగ్ నిబంధనలను పర్యవేక్షించాల్సిన బాధ్యత రివ్యూ కమి టీపై ఉంది.

ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న అప్పటి సీఎస్‌లు సోమేష్‌కుమార్, శాంతి కుమారి, సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్‌రావు, అప్పటి ఇం టెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్లను సిట్ సాక్షులుగా విచారించింది. వీరందరినీ ముఖాముఖిగా ప్రశ్నిస్తూ, గతంలో వారు ఇచ్చిన సమాచారానికి, ఇప్పుడు లభిస్తున్న ఆధారాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను సరిపోల్చుకుంది. వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది.  

ప్రభాకర్‌రావు నియామకంపై ప్రధాన ఫోకస్

ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ టి ప్రభాకర్ రావు నియామకం చట్టబద్ధతపై సిట్ ప్రధానం గా దృష్టి సారించింది. ప్రభాకర్‌రావు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయనను తిరి గి ఎస్‌ఐబీలో ఓఎస్డీగా ఎందుకు నియమించారు? ఇంటెలిజెన్స్ విభాగానికి హెడ్‌గా ఒక రిటైర్డ్ అధికారిని నియమించే వెసులుబాటు నిబంధనల్లో ఉందా? ఈ నియామకానికి సంబంధించిన ఫైలును ఎవరు కదిలించారు? ఎవరి ఒత్తిడి, లేదా ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకే మాజీ సీఎస్‌లను సిట్ గంటల తరబడి ప్రశ్నించినట్లు సమాచారం. 

మీడియా, ప్రతిపక్షాలే టార్గెట్

గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, సొంత పార్టీలోని అసమ్మతివాదులు, వ్యాపారవేత్తలతో పాటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టుల ఫోన్లను కూడా ఎస్‌ఐబీ అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే ఉపయోగించాల్సిన అత్యున్నత సాంకేతికతను, రాజకీయ అవసరాలకు ఎలా వాడారన్నది ఈ కేసులో ప్రధాన అంశం. దేశంలో విద్రోహ చర్యలకు కుట్ర పన్నారనే సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

సప్లిమెంటరీ చార్జిషీట్‌కు రంగం సిద్ధం

మాజీ సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ అధికారుల విచారణ పూర్తి కావడంతో సిట్ తదుపరి అడుగుపై ఉత్కంఠ నెలకొంది. సేకరించిన సాక్ష్యాధారాలు, వాంగ్మూలాల ఆధారంగా త్వరలోనే న్యాయస్థానంలో అనుబంధ చార్జిషీట్ దాఖ లు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రభాకర్‌రావు నియామకా నికి సహకరించిన వారి పేర్లను, ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ ప్రముఖుల పేర్లను చేర్చే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం ఖాయంగా కనిపిస్తోంది.

పైవారి ఆదేశాలంటే ఎవరు? 

విచారణలో భాగంగా ప్రభాకర్‌రావు గతంలో సిట్ అధికారులకు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తాను సొంతగా నిర్ణయాలు తీసుకోలేదని, ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని పెద్దల ఆదే శాల మేరకే నడుచుకున్నానని ఆయన స్ప ష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యం లో ఆ ఉన్నతాధికారులు ఎవరు? ఆదేశా లు జారీ చేసింది రాజకీయ నాయకులా? లేక పరిపాలనా అధిపతులా? అన్నది తేల్చాల్సి ఉంది. తాజా విచారణలో మాజీ సీఎస్‌ల నుంచి ఈ విషయంపై స్పష్టత తీసుకునే ప్రయత్నం జరిగింది.