12-09-2025 12:06:14 AM
హన్మకొండ సెప్టెంబరు 11( విజయ క్రాంతి): హన్మకొండ హంటర్ రోడ్ లోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ నేత విద్యార్థుల వసతి గృహంలో సీట్ల భర్తీ చేయాలని సర్వసభ్య సమావేశం గురువారం తీర్మానించింది. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు అధ్యక్షతన ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్టు బోర్డు సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్, ట్రస్ట్ బోర్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబారి సమ్మారావు,కోశాధికారి గజ్జెళ్ళి రవిందర్, డైరెక్టర్లు ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, ప్రొఫెసర్ వంగరి సూర్యనారాయణ, గౌరవ సలహాదారులు వేముల సదానందం నేత తదితరులు పాల్గొన్నారు. గతంలో చేరిన విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసుకొని వెళ్లి పోవడంతో ఏర్పడిన ఖాళీలలో నూతనంగా విద్యార్థులను చేర్చుకోవాలని సమావేశం తీర్మానిం చింది.
ఏదైనా డిగ్రీ దానికి సమానమైన కోర్సులో విద్యాసంస్థలలో చేరి చదువుతున్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు కోరారు.ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య కాకుండా మరో 25 సీట్లను భర్తీ చేయాలని తాము నిర్ణయించామని ఆయన తెలిపారు. చేనేత కార్మికులకు కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఉన్నత చదువులకు దూరమవుతున్నారనే సదుద్దేశంతో బీసీ నేత విద్యార్థుల వసతి గృహం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఆర్థిక ఇబ్బందులతో అర్ధాంతరంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న చేనేత కార్మికుల విద్యార్థులకు తాము నిర్వహిస్తున్న వసతి గృహం ఎంతో దోహదపడుతున్నదని బీసీ నేత వసతి గృహంలో చేరిన విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం గత పదేళ్లుగా కల్పిస్తున్నట్లు తెలిపారు. తాము నిర్వ హిస్తున్న బీసీ నేత వసతి గృహం ఆశ్రమం పొంది ఉన్నత విద్య అభ్యసించి వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించారని,ఇది తమకెంతో గర్వకారణంగా భావిస్తున్నామని, బీసీ నేత వసతి గృహంలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికుల కుటుంబా లకు చెందిన విద్యార్థులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏదైనా విద్యాసంస్థలో డిగ్రీ, ఇంజనీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్, పార్మసీ దానికి సత్సమానమైన తదితర కోర్సులలో విద్య అందిస్తున్న చేనేత విద్యార్థులు మా వసతి గృహంలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు తెలిపారు.
విద్యార్థులు స్థానిక తహసీల్దారు జారీ చేసిన కులం, ఆదాయం, నివాసం దృవీకరణ పత్రాలతో సహా అడ్మిషన్ పొందిన కళాశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్‌లు జతపర్చాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫారంలు వసతి గృహంలో అందుబాటులో ఉన్నాయని సెప్టెంబరు 30వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని,ధరఖాస్తుల పరిశీలనలు పూర్తి చేసిన తర్వాత ఆయా విద్యార్థులకు సమాచారం అందిస్తామని,బీసీ నేత వసతి గృహంలో సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు మొదటి వారంలో అడ్మిషన్లు పొందవచ్చని ఆయన తెలిపారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవా లని వన్నాలశ్రీరాములు కోరారు.