12-09-2025 12:04:41 AM
వెతికి పట్టుకున్న పోలీసులు, నడపలేని స్థితిలో లారీ డ్రైవర్
డ్రైవర్ గా మారిన కానిస్టేబుల్
మహబూబాబాద్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): లారీ యూరియా లోడ్ వస్తుందని రైతులకు అధికారులు టోకెన్లు ఇచ్చారు. టోకెన్లు తీసుకున్న రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. అయితే సమయం గడుస్తున్నప్పటికీ యూరియా లారీ జాడలేదు. క్యూ లైన్‌లో వేచి ఉన్న రైతులు యూరియా కోసం ప్రశ్నిం చడం మొదలుపెట్టారు.
దీనితో అధికారుల ద్వారా పోలీసులు యూరియా లారీ కోసం వాకబు చేయగా, వరంగల్ నుంచి యూరియా లోడుతో లారీ బయలు దేరిందని, ఇప్పటివరకే ఇక్కడికి రావాల్సి ఉందని సమాచారం ఇచ్చారు. దీనితో పోలీసులు సదరు లారీ కోసం వరంగల్ నుండి కేసముద్రం వరకు దారి పొడవునా తమ నెట్వర్క్ ద్వారా గాలింపు చేపట్టారు.
చివరకు కేసముద్రం దర్గా వద్ద లారీ నిలిచి ఉన్నట్లు గుర్తించి అక్కడికి పోలీసులు చేరుకున్నారు. లారీ డ్రైవర్ లారీ నడపలేని స్థితిలో ఉండడాన్ని గుర్తించారు. దీనితో లారీ డ్రైవింగ్ వచ్చిన అలీమ్ అనే కానిస్టేబుల్ లారీని తానే డ్రైవ్ చేసి తీసుకువచ్చి ఉప్పరపల్లి, కల్వల కేంద్రాలకు యూరియా దిగుమతి చేశారు. దీనితో రైతులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో గురువారం జరిగింది.