11-08-2024 12:52:39 AM
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): సరిపడా ఉపాధ్యాయులు లేక పేదవర్గాల పిల్లలు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా అందడంలేదు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే అవసరం ఉన్న చోట ఈ విద్యాసంవత్సరానికి మూడు నెలల కాలపరిమితికి విద్యావలంటీర్ల (అకడమిక్ ఇన్ స్ట్రక్టర్)ను నియమించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడంలో నారాయణపేట జిల్లాలో 233 మంది విద్యావలంటీర్లను తీసుకునేందుకు ఆ జిల్లా విద్యాధికారి ఈనెల 9న ఉత్తర్వులు జారీ చేశారు.
అర్హులైన వారి నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించి ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 13 వరకు నియామక ప్రక్రియను చేపట్టి 16 నాటికి విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను డీఈవో ఆదేశించారు. వీరిని ఎంఈవో, కాంప్లెక్స్ హెచ్‌ఎం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్‌పర్సన్ సమక్షంలో వీరిని నియమించనున్నారు. సీఎం సొంత జిల్లా కావడంతో ముందస్తుగా విద్యావలంటీర్లను నియమించుకునేందుకు అనుమతిని
ఇచ్చినట్లు తెలిసింది. అర్హతలు ఇలా...
జిల్లాలో మొత్తం 284 మంది అవసరం ఉంది. అయితే ఇందులో ముందస్తుగా 180 మంది ఎస్జీటీ, 53 మంది స్కూల్ అసిస్టెంట్‌లను తీసుకోవాలని నిర్ణయించారు. మిగతా చోట్ల టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. ప్రైమరీ పాఠశాలల్లో బోధించేవారికి (ఎస్జీటీ) ఇంటర్‌తోపాటు డీఎడ్, టెట్ అర్హత ఉండాలని నిర్ణయించారు. లేదంటే ఇంటర్‌తో పా టు డీఎడ్ అయినా ఉండాలి. బీఈడీతోపా టు డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఆ అభ్యర్థులు లేని పక్షంలో డిగ్రీ, ఇంటర్ ఉన్న వారిని తీసుకోవాలని నిర్ణయించారు.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీతోపాటు బీఎడ్, తెలుగు, హిందీ, ఉర్దూ పండిట్ ట్రైనీ చేసిన వారు ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు లేనప్పుడు డిగ్రీ చేసిన అభ్యర్థులను తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎం పికైన వారికి గౌరవ వేతనం కింద నెలకు (3 నెలల వరకు) రూ.15,600 ఇవ్వనున్నారు.
మరో రెండు జిల్లాల్లోనూ..
వికారాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ విద్యావాలంటీర్ల ను నియమించేందుకు ఆ జిల్లా వి ద్యాధికారులు ప్రభుత్వానికి అనుమతులు కోరినట్లు తెలిసింది. ఈమేరకు జిల్లావ్యాప్తంగా ఎంత మంది అవసరమనే వివరా లను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడనుంది. మరోవైపు ఇటీవల చేపట్టిన బదిలీలు, ప్రమో షన్లలో భాగంగా చాలా పాఠశాలల్లో సరిపడా టీచర్లు లేరు. దీంతో అక్కడా కొత్త టీచర్లు వచ్చేంతవరకు విద్యావలంటీర్లను నియమిం చే అవకాశం ఉంది. ఇప్పటికే డీఎస్సీ ద్వారా 11,062 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఈ క్రమంలోనే వీరు వచ్చేంతవరకు విద్యార్థులు నష్టపోకుండా ఈ నియామకాలు చేపడుతున్నారు.