calender_icon.png 30 December, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్న సాగుకు జై..!

30-12-2025 12:00:00 AM

యూరియాకు పెరుగుతున్న డిమాండ్

నానోపై అవగాహన కల్పించని అధికారులు

కల్వకుర్తి డిసెంబర్ 29 : యాసంగి సీజన్లో ఈసారి మొక్కజొన్న సాగుకు అధిక సంఖ్యలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత ఖరీఫ్లో అధిక వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతినడం, పెట్టుబడులు ఎక్కువగా కావడం, ఆలస్యంగా చేతికి రావడం వంటి కారణాలతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు. మొక్కజొన్న తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో పంట చేతికి వచ్చే అవకాశం ఉండటంతో  మొక్కజొన్నసాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధరతో కొనుగోలు చేయడం రైతుల్లో మరింత ధైర్యాన్ని కలిగిస్తోంది. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడం, కేఎల్‌ఐ కాల్వల ద్వారా నీటి సరఫరా జరుగు తున్న ఫలితంగా జిల్లావ్యాప్తంగా ఎన్నడూ లేనివిధంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

అధిక మొత్తంలో యూరియా వినియోగం

మొక్కజొన్న విత్తిన 20 రోజుల నుండి రైతులు పంట ఏపుగా పెరగడంతో పాటు అధిక దిగుబడి వచ్చేందుకు ఎక్కువ మొత్తంలో యూరియాను వినియోగిస్తున్నారు. దీంతో పంట ఏపుగా పెరిగేందుకు సమయానికి దుకాణాల్లో యూరియా ఉండదనే భావనతో ముందస్తుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆశించిన స్థాయిలోనే యూరియా సరఫరా ఉన్నప్పటికీ, మరో వారం నుంచి పదిరోజుల్లో విత్తిన వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయాల్సి ఉండటంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. కల్వకుర్తి డివిజన్ పరిధిలో సుమారు 3,010 ఎకరాల మొక్కజొన్న , 5,000 ఎకరాల వరి సాగు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.

మొత్తం వరి వేరుశనగ మొక్కజొన్న కుగాను 9,311 మెట్రిక్ టన్నుల యూరియా అవసరము. డిమాండ్ కు అనుగుణంగా యూరియా అందుబాటులో ఉంచడం జరుగుతుందని అధికారులు తెలిపారు. దీనిని ఆసరాగా చేసుకున్న  కొంత మంది ఎరువుల వ్యాపారులు ప్రభుత్వ ధరలను పట్టించుకోకుండా యూరియాను అధిక ధరలకు విక్రయించడం, ఇతర మందులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

నానో యూరియాపై ప్రచారం కరువు.

యూరియాకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్న నానో యూరియాపై వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సరైన అవగాహన లేకపోవడంతో రైతులు ఆ దిశగా అడుగు వేయడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో రైతులు అవగాహన లోపంతో నానో వినియోగించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నానో యూరియాపై  అవగాహన కల్పించడంతోపాటు పంటలకు  సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.