29-01-2026 12:00:00 AM
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధిం చి 79 ఏళ్లు కావొస్తున్నా మనం ఇంకా ‘అభివృద్ధి చెందుతున్న దేశమనే’ ము ద్రను పోగొట్టుకోలేకపోవడం శోచనీయం. ఇవాళ భారతదేశంలో రెండు విభిన్న ప్రపంచాలు కలిసి ప్రయాణం సాగిస్తున్నాయి. కొంతమంది ప్రపంచస్థాయి సంపదలో అగ్రభాగాన ఉంటే, దేశంలో ఎక్కువమంది మాత్రం ఇంకా ప్రాథమిక అవసరాల కోసం తమ పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక వైపు బిలియనీర్లు, అంతర్జాతీయ కంపెనీలు, స్పేస్ టెక్నాలజీ, డిజిటల్ పేమెంట్స్ భారత్ ఎదుగుదలను చూపిస్తుంటే.. మరోవైపు సరైన తాగునీరులేమి, విద్య, ఆరోగ్య సేవలు ఇంకా అందని ద్రాక్షగానే ఉన్న పేదలు కోట్లలో ఉండడం పేదరికాన్ని సూచిస్తుంది.
దీని వెనుక సమాజంలోని పైస్థాయి వర్గాల బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అయితే చాలామంది ధనవంతులు వ్యవస్థలోని లోపాల వల్లే ధనవంతులయ్యారు. తక్కువ పన్నులు, రాజకీయ అనుబంధాలు, కార్మికులకు తక్కువ వేతనాలు, ‘దేశం అభివృద్ధి చెందుతుంది’ అన్న మాటలు ధనవం తులకు రుచించవు. కాబట్టి సిగ్గు అనేది వ్యక్తిగత నైతికతపై ఆధారపడి ఉంటుంది. ‘అభి వృద్ధి చెందుతున్న దేశం’ అనే ట్యాగ్ ధనవంతులకు అవమానం కాకపోవచ్చు కానీ పేదలకు మాత్రం రోజువారీ వాస్తవం. మరి ధనవంతులు, ఉన్నత వర్గాలు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.
మార్పుకు దూరంగా..
భారతదేశంలో ధనవంతులు ఒక రకమైన రక్షణ కవచంలో బతుకుతున్నారు. నాణ్యమైన విద్య, వైద్యం, విలాసాలు కొనుక్కునే శక్తి ఈ వర్గానికి అందుబాటులో ఉం టుంది. కానీ అదే సమయంలో దేశంలోని సామాన్య ప్రజల సమస్యలు మాత్రం వీరిని తాకలేవు. ధనవంతులు రోడ్లు బాగాలేకపోతే విమానాల్లో ప్రయాణిస్తారు, ప్రభుత్వ పాఠశాలలు వద్దనుకుంటే చదువు కోసం తమ పిల్లలను విదేశాలకు పంపిస్తారు.
ఈ దూరం వల్ల వారికి వ్యవస్థను మార్చాలనే తపన తక్కువగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అనేకమంది ధనవంతులు తమ లా భాలను పెంచుకోవడంపైనే దృష్టి పెడతారు కానీ, ఆ సంపద సమాజంలోని కింది స్థాయి వరకు చేరాలనే ఆలోచన చేయరు. కార్పొరేట్ సామాజిక బాధ్యత అనే ప్రభుత్వ చట్టం ప్రకారం ధనవంతులు కొంత నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఒక విధిగా మాత్రమే జరుగుతున్నది తప్ప మనస్ఫూర్తిగా సమాజ మార్పు కోసం చేయడం లేద నిపిస్తుంది. ధనవంతులకు వ్యవస్థలోని లొసుగులు అనుకూలంగా మారుతున్నా యి. పన్నుల ఎగవేత లేదా రాజకీయ అండదండలతో తమ వ్యాపారాలను విస్తరించు కోవడం వల్ల ఆర్థికంగా ఎదుగుతున్నారు. కానీ వీరి ఎదుగుదల దేశాభివృద్ధికి తోడ్పడడం లేదు.
బాధ్యత అవసరం..
దేశాన్ని శాసించేది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులే. ఈ ఇద్దరి మధ్య ఉం డే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వల్ల సామాన్యుడికి అందాల్సిన ఫలాలు కొందరి దగ్గరే ఆగిపోతున్నాయి. దేశం అభివృద్ధి చెందుతున్నదిగా ఉన్నప్పుడే ధనవంతులకు చౌకగా శ్రమ దొరుకుతుంది, ఇది వారి వ్యా పారాలకు ఒక విధంగా లాభాన్ని చేకూరుస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాల్లో ధనవం తులు తమ దేశ గౌరవం కోసం పరిశోధనలకు, సామాజిక మార్పులకు భారీగా ఖర్చు చేస్తారు.
కానీ మన దేశంలోని ధనవంతులు మాత్రం విలాసవంతమైన వివాహాలకు, విదేశీ ప్రయాణాలకు పెట్టే ఖర్చులో పదో వంతు కూడా సామాజిక చైతన్యం కోసం ఖర్చు చేయడం లేదన్నది ఒక చేదు నిజం. అయితే దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ధనవంతుల ఆదాయం పెరగడం ఒక్కటే కాదు, పేదవాడి కొనుగోలు శక్తి కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధనవంతులు తాము సంపాదించే సమాజం పట్ల బాధ్యతగా ఉండనంత కాలం ఈ అసమానతలు ఇలాగే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
పెరుగుతున్న అవినీతి..
ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమయినప్పటికీ, ఆర్థిక అసమాన తలు పెరగడం వెనుక అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు కూడా ఉన్నా యి. ధనవంతులు మరింత ధనవంతులు కావడం, పేదలు పేదరికంలోనే మగ్గిపోవడానికి ప్రధాన కారణం ఆస్తుల కేంద్రీకరణ. వ్యాపారాలు, పరిశ్రమలు ఉన్నవారికి లాభా లు వేగంగా వస్తాయి. కానీ రోజువారీ కూలీలకు లేదా తక్కువ వేతన కార్మికులకు పెరిగే ధరలతో సమానంగా ఆదాయం మాత్రం పెరగడం లేదు.
ఆధునిక ప్రపంచంలో సా ంకేతికత తెలిసిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మన దేశంలో ఇప్ప టికీ సరైన విద్య, నైపుణ్యం లేనివారు తక్కువ ఆదాయం వచ్చే పనులకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వాలు తెల్ల రేషన్‌కార్డుల సం ఖ్యను పెంచుతున్నాయంటే ఒక రకంగా మన దేశంలో ప్రజలు పేదరికంలో ఉన్నారని ఒప్పుకోవడమే అవుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో కొన్నిసార్లు నిజమైన అర్హుల కంటే రాజకీయ లబ్ధిదారులకు కార్డులు పంచడం జరుగుతున్నది. సరైన ఉపాధి లేనివారికి ప్రభుత్వమిచ్చే ఉచిత పథకాలు వారి ఆకలిని తీరుస్తాయి.
కానీ పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడేయలేవు. చేతికి పని దొరకనప్పుడు మాత్రమే ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తారు. సంక్షేమ పథకాల కోసం కేటా యించిన నిధులు కింది స్థాయికి చేరేలోపే అదృశ్యమవ్వడం అవినీతిని సూచిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయాల వల్ల పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు, సామాన్య ప్రజలకు ఇచ్చే రాయితీల మధ్య సమతుల్యత దెబ్బతింటూ వస్తున్నది.
నాయకత్వ లేమి..
అధికారం కొన్ని వర్గాలకే పరిమితం కావ డం మరొక ప్రధాన కారణం. రాజకీయాల్లో వారసత్వం, ధనబలం పెరిగిపోవడం వల్ల నిజాయితీ గల నాయకుడికి అవకాశం దక్కడం లేదు. అధికారం కొందరి చేతుల్లోనే ఉన్నప్పుడు, నిర్ణయాలు కూడా ఆ వర్గాల ప్రయోజనాల కోసమే జరిగే ప్రమాద ముంది. ప్రజలు ఓటు వేసే సమయంలో అభివృద్ధిని, విద్యను, ఆరోగ్యాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా ఎన్నికల సమయంలో ఇచ్చే డబ్బు, బహుమతులకు ప్రభావితం కావడం వల్ల సరైన నాయకత్వం రావడం లే దు. సమానత్వం కేవలం చట్టాల వల్ల రాదు. పాలకుల్లో నిజాయితీ, ప్రజల్లో చైతన్యం రెండూ కలిసినప్పుడే మార్పు వస్తుంది. ఉచిత పథకాల కంటే, నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే పేదరికం తగ్గుతుంది.
వ్యాసకర్త సెల్: 91775 66741
డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్