02-05-2025 01:51:27 AM
జాతీయ వృద్ధిరేటుతో సమానంగా రాష్ట్ర వృద్ధి
హైదరాబాద్, మే 1 (విజయ క్రాంతి): గత నెలలో ప్రభుత్వానికి రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. ప్రభుత్వం మే 1వ తేదీన విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో జీఎస్టీ రూపంలో రూ. 2.37 లక్షల కోట్లు వసూలయ్యాయి. అంతకుముందు మార్చి నెలలో రూ.1.96 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే గతేడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం రూ. 2.1 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూలు చేసింది.
వార్షిక వసూళ్ల వేగం 12.6 శాతం ఉండటం గత 17 నెలల్లో ఇదే గరిష్టం. ఆర్థిక వ్యవస్థకు వినియోగం తోడ్పడటంతో త్రైమాసిక వసూళ్లు 2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ. 5.75 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ సంవత్సరానికి జీఎస్టీ ఆదాయంలో 11 శాతం పెరుగుదలను అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ జీఎస్టీ వసూళ్లు కూడా గణనీయంగా పెరిగాయి.
గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లలో 12 శాతం వృద్ధి కనిపించింది. 2024 ఏప్రిల్‌లో తెలంగాణ రూ.6,236 కోట్ల జీఎస్టీ రాబట్టగా, 2025 ఏప్రిల్ నెలలో రూ. 6,983 కోట్ల జీఎస్టీని రాబట్టింది. అయితే జీఎస్టీ వసూళ్లలో దాదాపు జాతీయ వృద్ధిరేటుతో సమానంగా తెలంగాణ రాష్ట్రం వృద్ధిని సాధించడం విశేషం. జీఎస్టీ వసూళ్లలో జాతీయ వృద్ధిరేటు 12.6 శాతం ఉండగా, తెలంగాణ వృద్ధిరేటు 12 శాతంగా నమోదైంది.