calender_icon.png 22 November, 2025 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాట్‌ఫిష్ దందాలో కొత్త రాజకీయం

18-08-2024 12:06:45 AM

  1. రెండు గ్రూపులుగా ఏర్పడి  లొల్లి 
  2. టెండర్ దక్కించుకున్నా చికెన్ వేస్టేజీ ఇవ్వని నిర్వాహకులు

వనపర్తి, ఆగస్టు 17 (విజయక్రాంతి): చికెన్ సెంటర్లలో లభించే వ్యర్థాలను సేకరించే టెండర్ల ప్రక్రియలో వనపర్తి మున్సిపాలిటీ కొత్త రాజకీయానికి వేదిక అయింది. చికెన్ వ్యర్థాలను మూగజీవాలకు ఆహారంగా అందించే బిస్కెట్ల తయారీ కోసం ఆయా కంపెనీలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అందుకు మున్సిపాలిటీలో నిబంధనల ప్రకారం టెండర్ దక్కించుకోవాల్సి ఉంటుంది. కాగా గతంలో లోపాయకారి ఒప్పందాలతో వ్యర్థాలను సేకరించి వాటిని నేరుగా క్యాట్‌ఫిష్ దందాకు ఉపయోగించేవారు.

దీంతో మున్సిపల్ ఆదాయానికి గండి పడటంతో పాటు క్యాట్‌ఫిష్ దందాకు సహకరించేలా ఉండేది. దీనిపై గత నెల 28న ‘కృష్ణానది తీరాన క్యాట్‌ఫిష్ దందా’ శీర్షికన విజయక్రాంతి పత్రికలో వచ్చిన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని మందలించడంతో టెండర్ వేశారు. చికెన్ వేస్టేజీలో పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందన్న విషయాన్ని గ్రహించి సుమారుగా 10 మంది టెండర్‌లో పాల్గొన్నారు. ఈ నెల 5న నిర్వహించిన టెండర్ ప్రక్రియలో  జిల్లా కేంద్రానికి చెందిన సిలమర్తి ఆంజనేయులు రూ.29.30లక్షలకు టెండర్ దక్కించుకున్నాడు. చికెన్ వేస్టేజీ సేకరణకు వాహనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఆదాయం వస్తుండటాన్ని గ్రహించిన చికెన్ సెంటర్ నిర్వాహకులు.. వేస్టేజీ ఇస్తే తమకేంటి లాభం అంటూ  మెలిక పెట్టారు. టెండర్ దక్కించుకున్న వ్యక్తికి చికెన్ వేస్టేజీ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. మున్సిపల్ అధికారుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావిస్తే టెండర్ కొనసాగించడమే తమ పని అంటూ చేతులెత్తేశారు. దీంతో టెండర్‌లో పాల్గొన్న మరో వ్యక్తి రూ.5 లక్షల వరకు ఇస్తానని, వేస్టేజీ తనకే ఇవ్వాలని చికెన్ సెంటర్ల నిర్వాహకులకు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖ మొదట టెండర్ దక్కించుకున్న ఆంజనేయులుకు నోటీసులు ఇవ్వడం కొసమెరుపు . 

తెరవెనుక ‘క్యాట్‌ఫిష్’ నిర్వాహకులు!

చికెన్ వేస్టేజీ సేకరణ వెనకాల క్యాట్‌ఫిష్ దందా చేస్తున్నవారి హస్తం ఉన్నట్లు తెలుస్తున్నది. టెండర్ దక్కించుకున్న వ్యక్తులకు చికెన్ వేస్టేజీ దక్కకుండా చేస్తున్నారు. చికెన్ వేస్టేజీ తమకే ఇచ్చేలా చికెన్ సెంటర్ నిర్వాహకులను బుట్టలో వేసుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది. క్యాట్‌ఫిష్ దందా నిర్వాహకులకు టెండర్ దక్కేలా పావులు కదిపిన వారికి నజరానా ఇస్తామని అధికారులకు కూడా భారీగా ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది.