08-01-2026 12:31:37 AM
జమ్మికుంట, జనవరి 7(విజయక్రాంతి): జమ్మికుంట డిగ్రీ కాలేజీలో సింథటిక్ స్టేడియం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రిఅధికారులు, కాలేజీ సిబ్బందితో సమావేశమైన బండి సంజయ్ హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే... అభివ్రుద్ధి అంటే ఏమిటో చూపిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజలకు విజ్ఝప్తి చేశారు. రాష్ట్రంలో, ఆయా మున్సిపాలిటీలల్లో బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ.. కేంద్రం నుండి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి అనేక అభివ్రుద్ది పనులు చేస్తున్నామని చెప్పారు. అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అమ్రుత్ పథకంలో చేర్చి కరీంనగర్ తరహాలో ఆధునీకరించబోతున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం జమ్మికుంట డిగ్రీ అండ్ పీజీ కాలేజీ స్థలంలో సింథటిక్ స్టేడియం నిర్మాణానికి రూ.6.5 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక ఆర్డీవో, తహిసిల్దార్ తో కలిసి కాలేజీ స్థలాన్ని పరిశీలించారు. సింథటిక్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల ప్రిన్సిపల్, సిబ్బందితో సమావేశమయ్యారు. వారి సూచనలను తీసుకున్నారు. కాలేజీలోని కొంత స్థలం కబ్జాకు గురైందని, ఆ స్థలాన్ని తిరిగి కాలేజీకి అప్పగించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్షారెడ్డి, స్థానిక నేతలు ఆకుల రాజేందర్, రఘ తదితరులు పాల్గొన్నారు.