24-09-2025 01:18:04 AM
-అమెరికాకు చెందిన రిపబ్లిక్ నేత వ్యాఖ్యలు
-హిందూ సంఘాల ఖండన
టెక్సాస్, సెప్టెంబర్ 23: అమెరికాలోని టెక్సాస్‌లో ప్రతిష్ఠించిన 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంపై ఆ దేశపు నేత చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ‘నకిలీ దేవుడంటూ అమెరికాకు చెందిన ఓ రిపబ్లికన్ పార్టీ నేత చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు హిందూవాదులు, నెట్‌జన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఒక క్రైస్తవ దేశమని పేర్కొంటూ, ఇక్కడ హిందూ దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ ఓ వివాదస్పద పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌పామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ నగరంలోని అష్టలక్ష్మి ఆలయంలో ఇటీవల 90 అడుగుల ఎత్తున హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ’స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టారు.ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను రిపబ్లికన్ నేత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది వైరల్ కావడంతో పలువురు హిందూ బంధువులు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడతున్నారు. ‘టెక్సాస్‌లో ఒక నకిలీ హిందూ దేవుడి విగ్రహాన్ని మనం ఎందుకు అనుమతిస్తున్నాం? మనది ఒక క్రైస్తవ దేశం‘ అని ఆయన పేర్కొన్నారు.
మరో పోస్టులో బైబిల్‌లోని వాక్యాలను ఉటంకిస్తూ, విగ్రహారాధనను వ్యతిరేకించారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డంకన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్‌ఏఎఫ్) ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇవి హిందూ వ్యతిరేక, రెచ్చగొట్టే వ్యాఖ్యలని పేర్కొంది. ఈ విషయంపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
వివక్షకు వ్యతిరేకంగా పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన డంకన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.మరోవైపు, చాలా మంది నెటిజన్లు కూడా డంకన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంటుందని, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉందని గుర్తుచేశారు. ఒకరి నమ్మకాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.